Cricket South Africa: దక్షిణాఫ్రికా సెంట్రల్ కాంట్రాక్ట్‌ వదులుకున్న స్టార్ స్పిన్నర్

ప్రపంచ లీగ్ ల్లో డబ్బు సంపాదించాలనే మోజులో పడి స్టార్ క్రికెటర్లు తమ క్రికెట్ బోర్డుకు షాక్ ఇస్తున్నారు. తమకు సెంట్రల్ కాంట్రాక్ట్‌ వద్దంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. ఈ లిస్ట్ లో ఏకంగా  ఐదుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు ఉన్నారు. విలియంసన్, కాన్వే, ఫిన్ అలెన్, బోల్ట్ లాంటి వారు ఈ లిస్టులో ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా దక్షిణాఫ్రికా స్టార్ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ తబ్రైజ్ షమ్సీ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వద్దనుకున్నాడు.

34 ఏళ్ల షమ్సీ, క్రికెట్ సౌత్ ఆఫ్రికా (CSA)తో కలిసి గురువారం (అక్టోబర్ 3) నాడు సంయుక్తంగా ప్రకటన చేశాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 ఫ్రాంచైజీ లీగ్ ల్లో అవకాశాలను పొందేందుకు అతను సెంట్రల్ కాంట్రాక్ట్‌ వదిలేసుకున్నట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. కుటుంబంతో సమయం గడిపేందుకు.. వారిని ఉత్తమంగా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు షమ్సీ వెల్లడించాడు.

దేశం తరపున ఆడేందుకు తాను ఎలాంటి పరిస్థితుల్లోనైనా సిద్ధమే అని అభిమానులకు హామీ ఇచ్చాడు. తన అవసరం దేశానికి ఉంటే అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చాడు. ఈ కారణంగానే నేను నా సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నానని  షమ్సీ తన ప్రకటనలో తెలిపాడు. క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ ఎనోచ్ ఎన్‌క్వే షమ్సీ నిర్ణయాన్ని గౌరవించినట్టు తెలుస్తుంది. సౌతాఫ్రికా తరపున షమ్సీ రెండు టెస్టులు.. 50 వన్డేలు.. 72 టీ20 మ్యాచ్ లాడాడు.