ఫుట్‌బాల్ స్టేడియమంటే ఎట్లుంటది? ఆటగాళ్లు ఉరుకలెత్తుతూ బంతిని తన్ని గోల్లో పడేస్తే అభిమానుల అరుపులు, కేరింతలతో దద్దరిల్లుతది! మరి, అట్లాంటి స్టేడియం ప్రశాంతంగా ఉంటే ఎట్లుంటది? చల్లటి గాలులు మొహాన్ని తాకి, దాని చిన్నని సౌండ్లు చెవులకు చేరితే ఎట్లుంటది మస్తుంటది కదా! అట్లాంటి అనుభూతి కలగాలంటే ఆస్ట్రియాలోని క్లేగన్ఫర్ట్కు వెళ్లాల్సిందే. మరి, అక్కడే కదా ఈ స్టేడియం అడవి ఉన్నది. వర్థెర్సీ అనే ఫుట్‌బాల్ స్టేడియం అడవిగా మారిపోయింది. స్విట్జర్లాండ్‌కు చెందిన క్లౌస్ లిట్మన్ అనే ఓ పెద్ద ఆర్టిస్టు ఆ అడవికి ప్లాన్ గీసిచ్చాడు. ఆ స్టేడియంలో దాదాపు 300 చెట్లను పెంచారు. ఒక్కో చెట్టు బరువు 6 టన్నులకుపైమాటే. 30 ఏళ్ల కిందట ఆస్ట్రియా ఆర్టిస్ట్ మ్యాక్స్ పెయింట్నర్ గీసిన ‘ఫర్ ఫారెస్ట్: ద అన్ఎండింగ్ అట్రాక్షన్ ఆఫ్ నేచర్’ పెయింటింగ్నే స్ఫూర్తిగా తీసుకుని స్టేడియంలో ఇలా అడవిని పెంచారన్నమాట. దానిని సెప్టెంబర్ 8న ప్రారంభించారు. ఆల్డర్, యాస్పెన్, వైట్ విల్లో, హార్న్బీమ్, మేపుల్, ఓక్ వంటి చెట్లతో అడవిని సృష్టించారు. ప్రస్తుతం అభివృద్ధి పేరిట అడవులను నరికేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి మనుషుల పనుల్ని సవాల్ చేస్తూ, ప్రకృతిని కాపాడుకోవాలన్న సంకేతం ఇస్తూ స్టేడియంలో అడవిని పెంచేశారట. అయితే, అది ఎక్కువ కాలం జనానికి కనిపించదు. అక్టోబర్ 27 వరకు మాత్రమే అందులోకి జనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత నో ఎంట్రీ. ఎందుకంటే, అప్పటికి అడవి ఉండదుగా మరి. అంటే, కొట్టేస్తారా.. అని అడగొద్దు. అడవిని ఆ స్టేడియం సమీపంలోనే మళ్లీ నాటేస్తారు. అక్కడ పెంచుతారు. మరి, ఆస్ట్రియాలో అదే ప్రధాన ఫుట్‌బాల్ స్టేడియం కదా. క్లేగన్ఫర్ట్ టీంకు అదే ఆధారం. ప్రాక్టీస్‌లు, నేషనల్ లెవెల్ మ్యాచ్‌లు అందులో ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టే ఈ తరలింపు.
