న్యూఢిల్లీ: స్కానియా అనే స్వీడిష్ ఆటోమొబైల్ సంస్థ భారత్‌లో వాహనాల అమ్మకాల విషయంలో అవినీతికి పాల్పడిందని ఆరోపణలు వస్తున్నాయి. వందకు పైగా దేశాల్లో విస్తరించిన స్కానియా కంపెనీ.. ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వాగన్ ఏజీ కమర్షియల్ వెహికల్స్ కింద 2007లో ఓ యూనిట్‌గా మొదలైంది. ఆ తర్వాత 2011లో మ్యానుఫాక్చరింగ్‌ను ప్రారంభించింది. భారత మార్కెట్‌లో సిటీ బస్సుల అమ్మకంలో మంచి వాటాను కలిగిన స్కానియా.. లంచాలకు పాల్పడినట్లు ఆరో్పణలు వస్తున్నాయి. దీనిపై స్కానియా సీఈవో హెన్రిక్సన్ స్పందిస్తూ.. అవును, అవినీతి జరిగిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు.
ఇండియాలో బాగా విస్తరించాలనే భావనలో పొంచి ఉన్న ప్రమాదాలను తాము పసిగట్టలేకపోయామని హెన్రిక్సన్ తెలిపారు. కంపెనీని విడిచి వెళ్లిపోయిన కొందరు వ్యక్తులు దీనికి పాల్పడి ఉండొచ్చన్న హెన్రిక్సన్.. ఈ విషయంలో అనుమానాలు ఉన్న బిజినెస్ పార్ట్‌నర్స్‌తో కాంట్రాక్ట్‌లను రద్దు చేశామన్నారు. జర్మన్ బ్రాడ్‌కాస్టర్ జెడ్‌డీఎఫ్, ఎస్‌వీటీ రిపోర్టు ప్రకారం.. ఒక భారత కంపెనీతో 11.8 మిలియన్ల (భారత కరెన్సీలో సుమారుగా రూ.84 కోట్లు) డీల్ విషయంలో ట్రక్కులను స్కానియా డెలివరీ చేయాల్సి ఉంది. అయితే చాసిస్ నంబర్లతోపాటు లైసెన్స్ ప్లేట్‌లను మార్చడం ద్వారా స్కానియా అవినీతికి పాల్పడింది. అలాగే బస్ కాంట్రాక్టులను దక్కించుకునేందుకు లంచం ఇచ్చిందని సమాచారం. ఈ బాగోతంలో పేరు తెలియని ఓ మంత్రికి కూడా భాగస్వామ్యం ఉందని తెలిసింది. సంస్థ పేరును దిగజార్చేలా జరిగిన ఈ ఉదంతంలో కంపెనీలో ఎవరికైతే హస్తం ఉందో వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్కానియా భావిస్తోందని అధికార ప్రతినిధి చెప్పారు. గమ్మత్తయిన విషయం ఏంటంటే.. ఈ స్కామ్‌పై కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అంతర్గతంగా విచారణ కొనసాగించడం గమనార్హం.
