- వివాదంలో స్వధార్ శక్తిసదన్
- ఇంట్లో పాచిపనికి తీసుకెళ్తున్నారని బాధిత యువతుల ఆరోపణ
- నిర్వహణ టైట్ చేయడంతో నిందలు వేస్తున్నారని పీడీ వివరణ
- ఎన్జీవో నిర్వహణలోని సెంటర్‌పై విచారణకు కలెక్టర్ ఆదేశం
- నిజామాబాద్ జిల్లాలో కలకలం
ఇల్లు, కుటుంబంలేని వితంతులు, జైలు శిక్షలు అనుభవించి బయటకు వచ్చాక ఎవరి ఆదరణ లేని అనాథ మహిళలు, యువతులు,అనుకోని సంఘటనలతో ఫ్యామిలీని కోల్పోయి ఒంటిరైన వారు స్వధార్ శక్తి సెంటర్లో ఆశ్రయం పొందొచ్చు. ట్రాఫికింగ్ మహిళా బాధితులు, వ్యభిచారంలోకి బలవంతంగా నెట్టబడి పోలీసుల సహాయంతో బయటపడిన వారు, భర్త వేధింపులతో గృహహింస ఎదుర్కొనే బాధితులు ఇందులో తలదాచుకునే వీలుంది. ఈ సెంటర్ నిర్వహణ ఎన్జీవోకు అప్పగిస్తారు. నిజామాబాద్‌లోని స్వధార్ శక్తి సెంటర్లో ఇటీవల ఓ యువతి వెళ్లిపోవడంతో కలకలం రేపుతోంది. దీంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
నిజామాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఫండ్‌తో జిల్లాలో ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న స్వధార్ శక్తి సదన్‌లో ఇటీవల జరిగిన పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. సెంటర్లో ఆశ్రయం పొందుతున్న తమను ఇంట్లో పాచిపనికి రమ్మని ఐసీడీఎస్ జిల్లా అధికారి రసూల్‌బీ వేధిస్తున్నారని ఇద్దరు అనాథ యువతుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మరో యువతి సెంటర్ నుంచి వెళ్లి జాడలేకుండా వెళ్లిపోయిన ఉదంతంపై నగర పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్వహణ లోపాలపై నిలదీయడంతో సెంటర్ నిర్వహిస్తున్న ఏజెన్సీ తనపై ఆరోపణలు చేయిస్తోందని పీడీ అంటున్నారు.
ఐసీడీఎస్ అజమాయిషీ
పక్క జిల్లాలలో స్వధార్ సెంటర్ల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐసీడీఎస్ పర్యవేక్షిస్తోంది. నిజాయితీ ట్రాక్ రికార్డు ఆధారంగా ఎన్జీవోలకు అప్పగించినా అజమాయిషీ మాత్రం ఐసీడీఎస్దే. నిజామాబాద్, బోధన్ సెంటర్లను ఒకే ఎన్జీవో కు చాలా కాలంగా ఇస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి గల వ్యక్తి నడుపుతున్న ఎన్జీవోపై పలు ఆరోపణలున్నా తనకున్న హైలెవల్ సంబంధాలతో చర్యలు లేకుండా తప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్ స్వధార్సెంటర్లో ఐదుగురు బాధితులు ఉన్నారు.
భర్త నుంచి విడాకులు పొంది తన మూడేండ్ల బిడ్డతో 25 ఏండ్ల యువతి, 4 ఏండ్ల కొడుకుతో మరో వితంతువు ఉంటున్నారు. మిగతా ముగ్గురు యువతులు 30 ఏండ్లలోపు వారే. వారిలో ఒకొక్కరిదీ ఒక్కో దయనీయ గాథ. పిల్లలున్న ఇద్దరు తల్లులూ ఇంటర్ దాకా చదువుకున్నారు. స్వశక్తిపై నిలదొక్కుకునే ట్రైనింగ్కావాలని తాము ఆశిస్తుండగా ఐసీడీఎస్ పీడీ రసూల్‌బీ ఇంటి పనులకు తీసుకెళ్తున్నారని, భోజనం కూడా సరిగా పెట్టడంలేదని, బాడీ మసాజ్ చేయించుకుంటున్నారని, తమ పిల్లలను వేరే వారికి దత్తతకిచ్చి హైదరాబాద్‌లోని ఆమె కుటుంబానికి చాకిరి చేయాలని దూషిస్తున్నారని గురువారం మీడియా ఎదుట బోరుమన్నారు.
ఆమె వేధింపులు తట్టుకోలేక 35 ఏండ్ల మహిళ స్వధార్ నుంచి పారిపోయినట్టు త్రీటౌన్పోలీస్ స్టేషన్లో నవంబర్ 26న కేసు నమోదైందని చెప్పారు. పరిణామాలను సీరియస్‌గా పరిగణించిన కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అదనపు కలెక్టర్ అంకిత్, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీని విచారణకు ఆదేశించగా వారు స్వధార్ సెంటర్ వెళ్లి బాధితులతో విడివిడిగా
చర్చించారు.
బిడ్డల్లా చూసుకుంటున్నా
స్వధార్ సెంటర్ నడుపుతున్న ఎన్జీవో అవకతవకలకు పాల్పడుతూ ప్రభుత్వ సొమ్మును కాజేస్తోంది. రెగ్యూలర్ విజిట్స్‌తో అసలు విషయాలు బయటపడంతో వార్నింగ్ ఇచ్చాను. ఇది నచ్చని నిర్వాహకుడు అమాయకులైన బాధితులను నాపై ఉసిగొల్పుతున్నాడు. సెంటర్ మూతపడుతుందని వారిని భయపెట్టి నాపై లేని ఆరోపణలు చేయిస్తున్నాడు. బాధితులను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నా. అవమానకరమైన నిందలు వేయడానికి వారికి ఎలా మనస్సు వచ్చిందో అర్థంకావడంలేదు. రసూల్‌బీ, పీడీ, ఐసీడీఎస్