అనారోగ్యంతో మంచం పట్టిన సుతార్​పల్లి

  •  20 రోజులుగా అనారోగ్య సమస్యలు 
  • దాదాపు 300 మంది బాధితులు
  •  ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి అస్వస్థత

మెదక్​, రామాయంపేట, వెలుగు: మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతార్ పల్లి మంచం పట్టింది.   20  రోజులు నుంచి స్థానికులు  అనారోగ్యానికి గురవుతున్నారు.  గ్రామంలో 256 కుటుంబాలు ఉండగా1,500 జనాభా ఉంది. కాగా ఇప్పటి వరకు దాదాపు 300 మంది అనారోగ్యం పాలయ్యారు. చాలా మందికి కాళ్ళు, మడిమల నొప్పులు, కాళ్ల వాపు సమస్య ఉంటుండగా, కొందరికి జ్వరాలు సోకుతున్నాయి. చిన్న పిల్లలకు శరీరంపై దద్దుర్లు వస్తున్నాయి.  గ్రామంలోని  కొన్ని ఇండ్లలో ఇద్దరు, ముగ్గురు జ్వర బాధితులే ఉన్నారు.  

కాళ్ల నొప్పులు, వాపులు, జ్వరాలు సోకుతున్న వారిలో కొందరు మండల పరిధిలోని డి.ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్​సీ)లో, కొందరు రామాయంపేటలోని ప్రైవేట్​ ఆసుపత్రుల్లో, ఇంకొందరు సిద్దిపేట జిల్లాలోని ఆర్ వీ ఎం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.  డి.ధర్మారం పీహెచ్​సీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్​ ఏర్పాటు చేసి  బాధితులకు మెడిసిన్​ అందజేశారు.   అయినప్పటికీ  ఒకరి తర్వాత మరొకరు అన్నట్టు గ్రామస్తులకు అనారోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి.  వైద్య సిబ్బంది బాధితులకు బ్లడ్​ టెస్ట్​ లు చేయకపోవడం వల్ల వారికి సోకింది ఏ వ్యాధి అనేది నిర్ధారణ కాలేదు.

గ్రామంలో మిషన్​ భగీరథ నీరు సరిపడ సరఫరా కాకపోవడంతో, బోరు నీటిని కలిపి సరఫరా చేస్తున్నారు. దీంతోపాటు పారిశుధ్య లోపం ఉంది. జనావాసాల మధ్య చెత్త చెదారం పేరుకుపోవడం, వర్షానికి బురద నీరు నిల్వ ఉండటంతో దోమలు పెరిగాయి. తాగునీరు పరిశుభ్రంగా లేకపోవడం,  పరిసరాల పరిశుభ్రత లోపం, దోమల కారణంగా సుతార్​పల్లి గ్రామస్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు భావిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి  అనారోగ్యానికి గురైన వారికి బ్లడ్​ టెస్ట్​లు చేసి  కాళ్ల నొప్పులు, వాపులు, జ్వరాలు, పిల్లలకు దద్దుర్లు రావడానికి కారణాలేమిలో నిర్ధారించి తదనుగుణంగా అవసరమైన చికిత్స అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.   

  • మళ్లీ మెడికల్​క్యాంప్​ ఏర్పాటు

సుతార్​ పల్లి గ్రామంలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిసి  ఇటీవల రెండు సార్లు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి మందులు ఇచ్చాం. పరిసరాల పరిశుభ్రత లేక పోవడం, నీటి నిల్వ వల్ల దోమలు పెరగడం వల్ల   గ్రామంలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.  గ్రామంలో మళ్లీ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి టెస్ట్​లు చేయిస్తాం.- డాక్టర్​ హరిప్రియ, మండల మెడికల్​ ఆఫీసర్

  • ఇంట్లో అందరికి అనారోగ్యం

గత 15 రోజుల నుంచి  మా ఇంట్లోని అందరం జ్వరం, కీళ్ల నొప్పులతో  బాధపడుతున్నం. మా నాన్న  నర్సయ్యను ఆర్ వీ ఎం హాస్పిటల్ లో జాయిన చేశాం.  ట్రీట్​మెంట్​ కోసం ఒక్కొక్కరికి  నాలుగైదు వేల వరకు ఖర్చు అయ్యింది. 
- అక్కల స్వామి, లక్ష్మి, సుతార్​పల్లి

  • అనారోగ్యంతో  మానాన్న చనిపోయిండు

గత కొన్ని రోజుల నుంచి మా  ఇంట్లో  చిన్న, పెద్ద అందరం జ్వరాలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నం.   వారం క్రితం మా తండ్రి రాములు   కాళ్ళ నొప్పులు, జ్వరంతో బాధపడుతూ చనిపోయాడు. ఇలా ఎందుకు అవుతుందో అర్థం అయిత లేదు. పెద్ద డాక్టర్​ లు వచ్చి టెస్ట్​లు చేసి మంచి మందులు ఇయ్యాలి.
- రాగి సిద్దిరాములు, సుతార్​పల్లి