హైదరాబాద్: శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో గురువారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం రాష్ట్రమంతా ఉలిక్కిపడేలా చేసింది. 900 మెగావాట్ల సామర్థ్యం కలిగిన శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని ప్యానెల్స్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఉద్యోగులు మంటలను ఆర్పడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. మంటల్లో కాలిపోకుండా ప్లాంటును కాపాడడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రయత్నించారు. రాత్రి 12 గంటల వరకు వారి ప్రయత్నాలు కొనసాగినట్లు సమాచారం.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 17 మంది ఉద్యోగులు ప్లాంటులో ఉన్నారు. వారిలో 8 మంది బయటకు రాగలిగారు. కానీ మిగిలిన 9 మంది అక్కడే చిక్కుకుని పోయారు. ఎస్కేప్ టన్నెల్ ద్వారా వారు బయటకు రావడానికి ప్రయత్నం చేసినప్పటికీ, దట్టమైన పొగ వల్ల సాధ్యం కాలేదు. చనిపోయిన వారిలో డీఈ శ్రీనివాస్ గౌడ్ (హైదరాబాద్), ఏఈ వెంకట్‌రావు (పాల్వంచ), ఏఈ మోహన్ కుమార్ (హైదరాబాద్ ), ఏఈ ఉజ్మ ఫాతిమా (హైదరాబాద్), ఏఈ సుందర్ (సూర్యాపేట) ప్లాంట్ అటెండెంట్ రాంబాబు (ఖమ్మం జిల్లా) , జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్ (పాల్వంచ) హైదరాబాద్‌కు చెందినా అమర్ రాజా బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్ లు ఉన్నారు.
ఈ ప్రమాదంపై సీఐడీ విచారణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని ఆయన కోరారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు బయటకు రావాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.
