- గాయం నుంచి కోలుకొని దేశవాళీల్లో బరిలోకి
- అయినా ఫిట్‌నెస్‌పై కొనసాగుతున్న సస్పెన్స్
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్) : టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. గాయం నుంచి కోలుకున్నా.. దేశవాళీ క్రికెట్ ఆడుతున్నా అతను జట్టులోకి ఎప్పుడు తిరిగొస్తాడనే విషయంపై అటు బీసీసీఐ, ఇటు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) సరైన సమాచారం ఇవ్వడం లేదు. అతని ఫిట్‌నెస్‌పైనా క్లారిటీ లేకపోవడం క్రికెట్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. పేసర్ ఫిట్‌నెస్ గురించి ఎన్‌సీఏలో ఎవరో ఒకరు సరైన సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అభిప్రాయపడ్డాడు.
తాజాగా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ విషయంలో బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియా పేసర్ ఫిట్‌నెస్, అతని రీఎంట్రీ విషయంలో సరైన సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించాడు. షమీ చివరగా 2023 నవంబర్‌లో స్వదేశంలో వన్డే వరల్డ్ కప్‌లో ఇండియా తరఫున పోటీపడ్డాడు. అదే టోర్నీ సందర్భంగా గాయపడ్డ షమీ ఫిబ్రవరిలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకొని కోలుకున్నాడు. తిరిగి మైదానంలోకి వచ్చాడు. మ్యాచ్ ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు ఓ రంజీ మ్యాచ్‌లోనూ పోటీ పడ్డాడు. దాంతో ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఏదో ఒక దశలో అతను జట్టులోకి వస్తాడన్న వార్తలు వచ్చాయి.
ఒక రకంగా ఈసిరీస్‌లో షమీ లేకపోవడం జట్టును దెబ్బతీసింది. ఓవైపు జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తుండగా.. అతనికి సరైన సహకారం అందించే మరో పేసర్ లేకపోవడం ఇండియా విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. షమీ గైర్హాజరీలో ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దాంతో షమీ తిరిగి జట్టులోకి రావాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. వచ్చే నెలలో ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అయినా షమీ బరిలోకి దిగితే జట్టుకు మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వస్తున్నాయి.
పూర్తిగా కోలుకున్నాడా?
గాయం నుంచి కోలుకున్న తర్వాత షమీ గత నెల రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. సరిగ్గా ఏడాది విరామం తర్వాత ఆడిన మ్యాచ్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా 42.3 ఓవర్లు బౌలింగ్ చేసి7 వికెట్లు తీశాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్ బరిలోకి దిగిన షమీ 19 రోజుల్లో తొమ్మిది మ్యాచ్‌ల్లో పోటీ పడ్డాడు. అన్నింటిలోనూ తన నాలుగు ఓవర్ల పూర్తి కోటా బౌలింగ్ చేశాడు. మొత్తంగా 68 ఓవర్లు బౌలింగ్ చేసి 18 వికెట్లు పడగొట్టడంతో బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్టులకైనా అతను అందుబాటులోకి వస్తాడన్న ప్రచారం జరిగింది.
కానీ, ముస్తాక్ అలీ టోర్నీ సందర్భంగా కొన్ని మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసిన తర్వాత అతని మోకాలులో వాపు వచ్చినట్టు ఎన్‌సీఏ ఫిజియోలు గుర్తించారు. ఈ కారణంగానే బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో చివరి రెండు మ్యాచ్‌లకు అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. చాలా కాలం విరామం తర్వాత ఎక్కువ తీవ్రతతో బౌలింగ్ చేస్తుండటంతో అతని మోకాలిలో వాపు వస్తోందని గత నెల నాలుగో వారంలో బీసీసీఐ ప్రకటించింది. ఈ పరిణామాల తర్వాత విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌లో బెంగాల్ ప్రారంభ మ్యాచ్‌లకు షమీ దూరంగా ఉన్నాడు. కానీ, చివరి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో పోటీపడ్డాడు.
ALSO READ : Yuzvendra Chahal: మరో అమ్మాయి బౌల్డ్.. 'మిస్టరీ గర్ల్'తో యుజ్వేంద్ర చాహల్
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 3, 5వ తేదీల్లో బీహార్, మధ్యప్రదేశ్ జట్లతో మ్యాచ్‌లో ఓపెనింగ్ బౌలర్‌గా వచ్చిన షమీ ఎనిమిదేసి ఓవర్లు బౌలింగ్ చేశాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు పూర్తి కోటా బౌలింగ్ చేసిన అతను ఒక్కో వికెట్ సాధించాడు. చివరి పోరులో బ్యాటింగ్‌లోనూ రాణించి 42 రన్స్ సాధించిన అతను 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ కూడా చేశాడు.ఈ లెక్కన షమీ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడని చెప్పొచ్చు.
చాంపియన్స్ ట్రోఫీకి వచ్చేనా?
గత వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్ చేరడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. సెమీఫైనల్ సహా పలు మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. వచ్చే నెలలో ఇండియా సహా ఎనిమిది మేటి జట్లు బరిలోకి దిగే చాంపియన్స్ ట్రోఫీలో అతని సేవలు జట్టుకు కీలకం కానున్నాయి. పైగా, ఆసీస్ టూర్‌లో వెన్నునొప్పికి గురైన బుమ్రా ఈ టోర్నీ సమయానికి పూర్తిగా కోలుకుంటాడో లేదో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో షమీని చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
అయితే, ఏడాదికి పైగా విరామం వచ్చిన నేపథ్యంలో ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్ లేదా వన్డే సిరీస్‌లో ఆడిస్తే బాగుంటుందని మాజీలు భావిస్తున్నారు. తాజాగా నెట్స్‌లో మెరుపు వేగంతో బౌలింగ్ చేస్తున్న ఓ వీడియోను షమీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనికి ‘ఖచ్చితత్వం, వేగం, అభిరుచి... ప్రపంచంతో పోటీకి అన్నీ సిద్ధంగా ఉన్నాయి’ అని క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో అతని రీఎంట్రీ తొందర్లోనే ఉంటుందన్న వార్తలకు బలం చేకూరినట్టయింది.