- అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో ఇండియా
షార్జా : ఐపీఎల్ వేలంలో భారీ ధరతో అందరి దృష్టిని ఆకర్షించిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (46 బాల్స్‌లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 నాటౌట్).. అండర్–19 ఆసియా కప్‌లో దుమ్మురేపాడు. ఆయూష్ మాత్రే (51 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 నాటౌట్)తో కలిసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో.. బుధవారం జరిగిన గ్రూప్–ఎ లీగ్ మ్యాచ్‌లో ఇండియా 10 వికెట్ల తేడాతో యూఏఈపై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 44 ఓవర్లలో 137 రన్స్‌కే కుప్పకూలింది.
మహ్ముద్ రయాన్ (35) టాప్ స్కోరర్. ఇండియా బౌలర్లు యుధాజిత్ గుహా (3/15), చేతన్ శర్మ (2/27), హార్దిక్ రాజ్ (2/28) వరుస విరామాల్లో వికెట్లు తీసి యూఏఈ ఇన్నింగ్స్‌ను కట్టడి చేశారు. అక్షత్ రాయ్ (21), ఎథన్ డి సౌజ (17), ఉద్దిశ్ సూరి (16) కాసేపు పోరాడారు. ఇన్నింగ్స్ మొత్తంలో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో యూఏఈ చిన్న స్కోరుకే పరిమితం అయింది.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 16.1 ఓవర్లలోనే 143/0 స్కోరు చేసి నెగ్గింది. యూఏఈ బౌలర్ల నుంచి ప్రతిఘటన లేకపోవడంతో సూర్యవంశీ, ఆయూష్ సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగిపోయారు. శుక్రవారం జరిగే సెమీస్‌లో ఇండియా.. శ్రీలంకతో తలపడుతుంది.