
- మూసీ గేట్లు ఓపెన్
- పూర్తిగా నిండిన మూసీ.. రెండు గేట్ల ద్వారా నీటి విడుదల
- సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
సూర్యాపేట, వెలుగు : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ జంట నగరాల నుంచి తరలివస్తున్న వరదతో సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 645 అడుగులు కాగా... ప్రస్తుతం 643 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.
ఎగువ నుంచి 1,427 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్ట్ 3,8వ నంబర్ల గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 1,293 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొదట రెండో నంబర్ గేట్‌ను ఎత్తాలని నిర్ణయించినప్పటికీ.. సాంకేతిక లోపం తలెత్తడంతో మూడో నంబర్ గేట్‌ను ఓపెన్ చేశారు.
సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఎగువ నుంచి 1.20 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో ప్రాజెక్ట్ నీటిమట్టం 580 అడుగులకు చేరుకుంది. ఇక్కడి నుంచి ఎడమకాల్వకు 4,287 క్యూసెక్కులు, కుడి కాల్వకు 511 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీకి 1800 క్యూసెక్కులు కలిపి మొత్తం 6,598 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి భారీ స్థాయిలో ఇన్‌ఫ్లో వస్తుండడంతో సాగర్ వద్ద విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు జెన్‌కో సీఈ మంగేశ్‌కుమార్ వెల్లడించారు. మొత్తం ఎనిమిది యూనిట్లలో 815.6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తామన్నారు.