ఖరీదైన కార్లలో గంజాయి రవాణా

  • ఒడిశా నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా
  • 100 కేజీలకు పైగా గంజాయి పట్టుకున్న సూర్యాపేట జిల్లా పోలీసులు 
  • ఏడుగురు అరెస్ట్..  మూడు కార్లు, 9 సెల్ ఫోన్లు సీజ్

సూర్యాపేట, వెలుగు : ఒడిశా నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు ఖరీదైన కార్లలో గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ కింద సూర్యాపేట టౌన్ పీఎస్ లో  ఒక కేసు, కోదాడ పీఎస్ లో ఒక కేసు నమోదు చేశారు.  సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదివారం సూర్యాపేట పోలీసులు జాతీయ రహదారిపై రాజీవ్ గాంధీ పార్క్ వద్ద తనిఖీలు చేస్తున్నారు. రెండు గుర్తు తెలియని కార్లు అనుమానాస్పదంగా వస్తుండగా ఆపి తనిఖీలు చేయగా గంజాయి దొరికింది.

కారులోని నిందితు లు పారిపోయేందుకు యత్నించగా పట్టుకుని విచారించారు. నిందితులను ఏపీకి చెందిన మోహనకృష్ణ,  పోరాత్ రాజు, షేక్ ఖాసిం, విజయ్ కుమార్, విజయ్ కృష్ణ, బొమ్మగాని శ్రీకాంత్ గౌడ్ గా గుర్తించారు. వారి వద్ద 75 కిలోల గంజాయి, 8 సెల్ ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు 27.40 లక్షల వరకు ఉంటుంది.  నిందితులు ఖరీదైన కార్లలో వెనుక భాగంలోని బంపర్ డూమ్ మధ్యలో ఒక ప్రత్యేక జాలి ఏర్పాటు చేసుకొని గంజాయి ప్యాకెట్లను దాచి, దానిపై బంపర్ డూమ్​ను యధావిధిగా పెట్టి రవాణా చేస్తున్నట్టు తేలింది.

అదేవిధంగా శనివారం ఏపీలోని వైజాగ్ నుంచి విజయవాడ మీదుగా ఓ వ్యక్తి కారులో  హైదరాబాద్  వైపు వెళ్తూ.. మార్గమధ్యలో పోలీసుల కంటపడకుండా తప్పించుకుంటూ పోతుండగా..  ముందస్తు సమాచారం మేరకు కోదాడ పోలీసులు హోండా సిటీ కారును ఆపి తనిఖీలు చేయగా.. 37 కిలోల 460  గ్రాముల  గంజాయి దొరికింది. నిందితుడు ఖరీదైన కార్లలో వెనుక సీటు కింది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇనుప పెట్టెలో గంజాయి రవాణా చేస్తున్నాడని తేలింది. అతడిని అదుపులోకి తీసుకుని మొబైల్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గంజాయి విలువ సుమారు 9.25లక్షల వరకు ఉంటుంది.  

నిందితులంతా జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బు సంపాదించేందుకు విలువైన కార్లలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారని, గతంలో వీరిపై  పలు పీఎస్ ల్లో  కేసులు నమోదై ఉన్నట్టు  ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.