IND vs SA 2nd T20: అతనికి ఒక్క ఓవరే ఇస్తాడా.. చెత్త కెప్టెన్సీతో టీమిండియాను ముంచిన సూర్య

సౌతాఫ్రికాతో ముగిసిన రెండో టీ20లో భారత్ పోరాడి ఓడిపోయిన సంగతి తెలిసిందే. బౌలర్లు రాణించినా.. బ్యాటర్లు విఫలం కావడంతో రెండో టీ20లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 4 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇరు జట్లు 1-1 తో సమంగా నిలిచాయి. స్వల్ప లక్ష్యం అయినప్పటికీ భారత్.. సౌతాఫ్రికాను భయపెట్టిన తీరు అద్భుతమని చెప్పాలి. ఒకదశలో గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కారణంగా చేజారిందని స్పష్టంగా అర్ధమవుతుంది.
 
125 పరుగుల లక్ష్య ఛేదనలో స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సౌతాఫ్రికా 66 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు పడగొట్టి సఫారీలను వణికించాడు. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్‌,హెన్డ్రిక్స్, మార్కరం,జాన్సెన్ ల వికెట్లు తీసి మ్యాచ్ ను భారత్ వైపుకు తిప్పాడు. మరో ఎండ్ లో బిష్ణోయ్ ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టాడు. పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుండడంతో మ్యాచ్ భారత్ గెలవడం ఖాయంగా కనిపించింది. 

ఇదే సమయంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. అక్షర్ పటేల్ ను సరిగా ఉపయోగించుకోలేదు. బంతి విపరీతంగా టర్న్ అవుతున్నప్పటికీ అక్షర్ పటేల్ కు ఒక ఓవర్ మాత్రమే ఇచ్చాడు. అతను వేసిన ఈ ఓవర్ లో రెండే పరుగులు ఇచ్చినా సూర్య అతనిపై నమ్మకం ఉంచలేదు. అక్షర్ పటేల్ కు మరో రెండు ఓవర్లు ఇచ్చినా భారత్ గెలిచేదని నెటిజన్స్ తో పాటు క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. దీంతో సూర్య కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. 

Also Read:-ఐదుగురితోనే తొలి బ్యాచ్.. ఆస్ట్రేలియా బయలుదేరిన భారత ఆటగాళ్లు వీరే

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి  124 పరుగులు మాత్రమే చేయగలిగింది. 39 పరుగులు చేసిన హార్దిక్ పాండ్య టాప్ స్కోరర్ గా నిలిచాడు.  భారత్ విధించిన 125 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఛేజ్ చేసింది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టి ఆశలు రేపినా.. విజయం సఫారీలనే వరించింది.