ఇందిరమ్మ ఇండ్లపై 16 నుంచి 30 దాకా సర్వే

  • కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు
  • ఒక్కో ఆఫీసర్​కు 500 అప్లికేషన్లు
  • సర్వే పూర్తయ్యాక యాప్​లో దరఖాస్తుల అప్​లోడ్ ఎంపీడీవో ఆఫీసుల్లో 
  • ఇందిరమ్మ మోడల్ హౌస్​లు

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లపై ఈ నెల 16 నుంచి 30 దాకా సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు ఈ స్కీమ్​పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజావాణిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులపై సర్వే చేసి యాప్​లో అప్​లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఇండ్ల సర్వేలకు అధికారులను కలెక్టర్లే ఖరారు చేయాలని.. ఇందులో టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని సూచించారు.

ఒక్కో ఆఫీసర్​కు 500 అప్లికేషన్లు అప్పగించాలన్నారు. రూరల్ ఏరియాల్లో పంచాయతీ సెక్రటరీ, ఏఈవోలు, అర్బన్ ఏరియాల్లో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లకు ఈ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఇండ్ల సర్వేకు సంబంధించిన అంశాలపై యాక్షన్ ప్లాన్​ను కలెక్టర్లు ఖరారు చేయాలన్నారు. 15 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. మొబైల్ యాప్ పనితీరుపై అధికారులకు ట్రైనింగ్ ఇవ్వాలన్నారు.

ఇందిరమ్మ ఇండ్లపై ఇందిరమ్మ కమిటీలతో మండలాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఇండ్ల స్కీమ్ పై మీడియాలో ప్రకటనలు ఇవ్వాలన్నారు. సర్వే పనితీరు, సొంత జాగా ఉన్నవాళ్లు, ప్రస్తుతం ఉన్న ఇండ్ల పరిస్థితిపై కలెక్టర్లు ప్రభుత్వానికి రిపోర్ట్ పంపాలని తెలిపారు. స్కీమ్ గ్రీవెన్స్​ను తీసుకునేందుకు స్టేట్ లెవల్​లో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఆఫీస్, జిల్లా స్థాయిలో కలెక్టరేట్​లో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సెక్రటరీ ఆదేశించారు. ఎంపీడీవో ఆఫీసుల్లో మోడల్ హౌస్​లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.