చెరువుల సర్వే స్పీడప్

  • సిద్దిపేట జిల్లాలోని 3 మండలాలు హెచ్​ఎండీఏ పరిధిలోకి
  • ఎఫ్టీఎల్ నిర్థారణలో అధికారులు
  • ప్రైమరీ నోటిఫికేషన్ల జారీ
  • హైడ్రాలో చేర్చే అవకాశం

సిద్దిపేట, వెలుగు: జిల్లాలోని మూడు మండలాల చెరువులు, కుంటల సర్వే స్పీడందుకుంది. ములుగు, వర్గల్, మర్కుక్ మండలాలు హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథార్టీ (హెచ్ఎండీఏ)లో ఉండగా వీటి పరిధిలో 347 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించి హద్దుల నిర్ధారణకు రెవెన్యూ, ఇరిగేషన్, ల్యాండ్ సర్వే అధికారులు రంగంలోకి దిగారు. ఓఆర్ఆర్ కు సమీపంలో ఉన్న ఈ 3 మండలాల చెరువులు, కుంటలను భవిష్యత్​లో హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉండడంతో వాటి విస్తీర్ణాన్ని గుర్తించే పనిలో పడ్డారు.

ములుగు మండలం143, మర్కుక్ 57, వర్గల్ మండలంలో 147 చెరువులు, కుంటలు ఉన్నాయి. ములుగులో 95, మర్కుక్ లో37, వర్గల్ లో మొత్తం చెరువులకు ప్రైమరీ నోటిఫికేషన్,​ వర్గల్​లో 35 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ సైతం విడుదల చేశారు. 

సర్వే ఆధారంగా మ్యాప్ లు..

హెచ్ఎండీఏ పరిధిలోని 3 మండలాల చెరువులు, కుంటల సర్వేను పూర్తి చేసి వాటి భద్రతకు మ్యాప్ లను సిద్ధం చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.  ముందుగా మండల స్థాయిలో రెవెన్యూ, భూ-సర్వే, నీటిపారుదల శాఖల అధికారులు చెరువుల విస్తీర్ణాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఆయా గ్రామాల్లో చెరువులు, కుంటల వివరాలను గోడపై అతికించి, వాటిపై గ్రామ సభలు నిర్వహించి భద్రత చర్యలను చేపడుతారు.

ఇందుకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ ప్రక్రియను స్పీడప్​చేసి ఫైనల్ నోటిఫికేషన్ జారీచేసే విషయంలో ఎదురయ్యే  సమస్యలపై  ప్రత్యేకంగా చర్చించారు. సర్వే తో పాటు ఎఫ్టీఎల్ నిర్ధారణ పూర్తి చేసి ఫైనల్ నోటిఫికేషన్ అనంతరం ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే కూల్చివేసే అవకాశాలున్నాయి.

అభ్యంతరాల స్వీకరణకు అవకాశం

మూడు మండలాల్లో చెరువులు, కుంటల విస్తీర్ణాన్ని ఖరారు చేసే విషయంలో ప్రిలిమినరీ నోటిఫికేషన్ తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఫైనల్ నోటిఫికేషన్ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా నీటిపారుదల, రెవెన్యూ, భూ సర్వే, హిస్టారికల్ సాటిలైట్ వ్యూ మ్యాప్ లను సేకరించి పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి హెచ్ఎండీఏ అధికారులకు ఆదేశాలు రావడంతో కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. జిల్లాలోని మూడు  మండలాల్లో 9 చెరువులకు సంబంధించిన పూర్తి  సమాచారం మాత్రం పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.  

కబ్జాల నిరోధానికి..

చెరువులు, కుంటల విస్తీర్ణాన్ని నిర్ణయించిన తర్వాత భవిష్యత్​లో అవి ఆక్రమణకు గురికాకుండా వీటిని హైడ్రా పరిధిలో చేర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ములుగు మండలం బండతిమ్మాపూర్ లో పాలసముద్రం చెరువు ఎఫ్టీఎల్ లో కొందరు కాంపౌండ్ నిర్మించగా, కొత్తూరులోని గోనెవాణి కుంట ఆక్రమణకు గురవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు సర్వే అనంతరం చెరువులు, కుంటల పూర్తి విస్తీర్ణాన్ని ఖరారు చేసి కబ్జాకు గురికాకుండా భద్రతా చర్యలు తీసుకోనున్నారు.