నిజామాబాద్ జిల్లా రూరల్​లో ఇండ్ల సర్వే లేట్​

  • ఐదు రోజులు ఆలస్యంగా ఫీల్డ్​లోకి సెక్రటరీలు
  • ఎట్టకేలకు ఫీల్డ్​వెరిఫికేషన్​ప్రారంభం​
  • పొరుగు పంచాయతీల్లోడ్యూటీల డిమాండ్​ యథాతధం
  • ఒత్తిడిలేని సర్వే వాతావరణం కల్పించాలని వినతులు
  • టౌన్​ ఏరియాలలో సాఫీగా సాగుతున్న సర్వే 

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం సర్వే కొనసాగుతోంది. అర్బన్​ ఏరియాలో గత శనివారం మొదలు కాగా, గ్రామాల్లో ఐదు రోజులు ఆలస్యంగా గురువారం ప్రారంభమైంది. లబ్ధిదారుల ఎంపిక బాధ్యత తమకు వద్దని, ఒత్తిడిలేకుండా పారదర్శకంగా సర్వే చేయడానికి పక్క గ్రామాల్లో డ్యూటీ వేయాలన్నారు.  సెక్రటరీగా పనిచేస్తున్న గ్రామంలో నే సర్వే చస్తే లోకల్​ పెద్దలతో  ఇబ్బంది వస్తుందని అంటున్నారు.ఈ మేరకు  అధికారులకు వినతిపత్రాలు ఇచ్చిన కార్యదర్శులు ఇండ్ల సర్వేకు ఇన్నాళ్లు దూరంగా ఉన్నారు. అయితే సర్కారు పరిధిలో తీసుకోవాల్సిన నిర్ణయం పట్ల తామేమీ చేయలేమని ఆఫీసర్లు చెప్పడంతో సర్వే లో పాల్గొంటున్నారు. 

ఈనెలాఖరుకు పూర్తిచేయాలని ఆదేశాలు​

సర్కారు ప్రకటించిన ఆరు గ్యారంటీల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు వివరాలు ఆన్​లైన్ లో నమోదు చేయించారు. ఇందులో 3.20 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్లు కావాలని ఆర్జీలు ఇచ్చారు. వారిలో ఇప్పటికే ఇండ్లున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. అనర్హులను పక్కనబెట్టి అర్హతగల పేదలను మాత్రమే స్కీమ్​కు ఎంపిక చేయాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపిక​ విషయంలో గతంలో జరిగిన తప్పులు రిపీట్​ చేస్తే కఠిన చర్యలు​ తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు.

   మొదటి విడతలో సొంత జాగాలున్న పేద దళితులు, గిరిజనులు, బీపీఎల్​ కుటుంబాలు, వ్యవసాయ కూలీలు, అనాథలు, వితంతువులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్​జెండర్లు, శానిటేషన్​లేబర్లకు ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్​కు 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని పాలకులు నిర్ణయించారు. జిల్లాలోని ఐదు సెగ్మెంట్​లకు కలిపి మొత్తం 17,500 ఇండ్లు మంజూరు కానున్నాయి.   

ప్రజాపాలనలో ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్​లో డౌన్​లోడ్​ చేసి విలేజ్​ సెక్రటరీలకు ఇచ్చి సర్వే ఎలా చేయాలో గత శనివారం ట్రైనింగ్​ఇచ్చారు. వెంటనే సర్వే స్టార్ట్​ చేసి ఈనెలాఖరుకు పూర్తి చేయాలని వారికి ఆదేశాలున్నాయి. నగర పాలక సంస్థ, బోధన్, ఆర్మూర్, భీంగల్​ మున్సిపాలిటీలలో వార్డు ఆఫీసర్లతో గత శనివారం మొదలైన సర్వే ఇప్పటికి20  వేల ఇండ్లు దాటింది. 

ఒత్తిడి వస్తుదంటూ కార్యదర్శులు దూరం

జిల్లాలోని 545 గ్రామ పంచాయతీల్లో ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వేను  సెక్రటరీలకు అప్పగించారు. ఫీల్డ్​ వెరిఫికేషన్​తో లబ్ధిదారుల ఎంపిక అధికారాలు​ పూర్తిగా వారికే ఇచ్చారు.  యాప్​లో  సెలెక్టెడ్, నాట్​ సెలెక్టెడ్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది నొక్కితే అది ఫైనల్​ అవుతుంది. దీనిని సెక్రటరీలు వ్యతిరేకిస్తున్నారు. సర్వే తర్వాత ఇండ్లు మంజూరుకాని వారికి తామ టార్గెట్ అవుతామని వారి భయం.

 ఎంపిక బాధ్యత వల్ల లోకల్​గా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నామని వాదిస్తున్నారు. సెలక్షన్​ యాప్​ మార్చాలని, అలాకాకుంటే పక్క మండలాల్లో సర్వే అప్పగించాలని కోరుతున్నారు.  లోకల్​ సర్వే విధులను కార్యదర్శులు ఇష్టపడడంలేదు. గత శనివారం మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టాల్సిన సర్వేకు ఈ కారణంగా దూరంగా ఉన్నారు. ఆఫీసర్ల ఆదేశాలతో గురువారం ఫీల్డ్​లోకి ఎంటరైనా అయిష్టంగానే వ్యవహరిస్తున్నారు.  

ఇంకా వేచిచూస్తున్నం

ఇండ్ల సర్వేను మేం వద్దనడంలేదు. ఎంపిక​ బాధ్యతను మాత్రమే వద్దంటున్నాం. అంతా కార్యదర్శులపై వేస్తే రేపు మాకు ఇబ్బందులు వస్తాయి. ఆఫీసర్ల స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలను మాకు అప్పగిస్తే ఎట్లా. పక్క మండలాల సర్వే డ్యూటీ  వేస్తే కనీసం ఒత్తిడికి లేకుండా పనిచేయగలం. ఆఫీసర్లు వాస్తవ పరిస్థితులు గ్రహించాలి. ప్రస్తుతానికి సర్వే షురూ చేసినప్పటికీ  స్టేట్​ కమిటీ ఫైనల్​ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నం. 

విజయ్. ప్రెసిడెంట, జిల్లా గ్రామ పంచాయతీ కార్యదర్శుల యూనియన్