అయోధ్యలో ఆర్మీ.. అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత

అయోధ్యలో ఆర్మీ.. అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత

జనవరి 22 న అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా అయోధ్యలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.12వేల మంది పోలీసులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయోధ్యలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల అరెస్ట్ తో అయోధ్య పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు.  కేంద్ర హోం శాఖ అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేసింది. భద్రతా ఏర్పాట్లను ఆర్మీ సీనియర్ అధికారులు పరిశీలించారు. 

దీంతోపాటు సైబర్ నేరగాళ్ల నుంచి ముప్పుఉండటంతో హైలెవెల్ సైబర్ ఎక్స్ పర్ట్ టీమ్ ను కేంద్ర హోం శాఖ అయోధ్యకు పంపించింది. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద చర్యలను గుర్తించేందుకు తొలిసారి సెక్యూరిటీ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్  సిస్టమ్ ను ఉపయోగిస్తున్నాయి. 

అయోధ్యలో సిటీ లో సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. సిటీ మొత్తం 10వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్క రామమందిరం ఆవరణలోనే 400 సీసీటీవి కెమెరాలను అమర్చారు. ఎల్లో జోన్ లో మొదటిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నామని పోలీసులు చెప్పారు. 

మరో వైపు లడ్డూలు, విరాళాలు, ప్రవేశాలకు సంబంధించిన మోసాలను అరికట్టేందుకు భద్రతా ఏజెన్సీలు నిఘా పెంచాయి. విరాళాలుగా డబ్బు పంపేందుకు QR  కోడ్ ని స్కాన్ చేయమని బెదిరిస్తున్న కొందరు సభ్యుల ముఠాను పట్టుకున్నారు పోలీసులు. QR కోడ్ రామాలయం ట్రస్ట్ కు బదులుగా స్కామర్ల బ్యాంక్ ఖాతాలను వెళ్తున్నట్లు గుర్తించారు. 

అంతేకాకుండా రామమందిరంలోకి ప్రవేశం కల్పిస్తామంటూ వాట్సాప్ లలో సందేశాలను భద్రతా ఏజెన్సీలు గుర్తించాయి. భక్తుల ఆర్తిక సమాచారం, లోకేషన్, ఫొటోలు, వీడియోలు రహస్యంగా స్క్రాప్ చేసి ఫైల్ డౌన్ లోడ్ చేయమని సందేవాలు పంపుతున్నట్లు గుర్తించారు. 

అయోధ్య రామ మందిరంలో అద్భుత ఘట్టం ప్రాణ ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తించే సోషల్ మీడియా కంటెంట్ పై కేంద్ర భద్రతా ఏజెన్సీలు నిఘా పెంచాయి. నిర్ధిష్ట కమ్యూనిటీని రెచ్చగొట్టే లక్ష్యంగా అనేక పోస్టులు బ్లాక్ చేశాం.. పరిశీలనలో ఉన్న మరికొన్ని పోస్టులఉన్నాయని అధికారులు చెబుతున్నారు.