Sanju Samson: సంజు శాంసన్‌కు నేను పెద్ద అభిమానిని: భారత మాజీ స్టార్ క్రికెటర్

భారత క్రికెటర్ సంజూ శాంసన్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడనే విమర్శకు చెక్ పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి టీ20లో ఈ భారత వికెట్ కీపర్ చెలరేగిపోయాడు. కేవలం 40 బంతుల్లోనే శతకం బాది టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఒక్క ప్రదర్శనతో భారత జట్టులో తన స్థానానికి డోకా లేదని నిరూపించాడు.ఎంతో ప్రతిభ దాగి ఉన్న సంజు శాంసన్ పై భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా ప్రశంసలు కురిపించాడు. 

టీమిండియా తరపున వైట్ బాల్ ఫార్మాట్ లో రైనా అత్యుత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న రైనా.. సంజు శాంసన్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. "నేను సంజూ శాంసన్‌కి పెద్ద అభిమానిని. అతను చాలా ప్రతిభావంతుడు. అతని నుండి ఇంకా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు వస్తాయి. అతనిలో కెప్టెన్సీ నైపుణ్యాలు కూడా ఉన్నాయి". అని రైనా చెప్పాడు. టీ20 క్రికెట్ లో భారత జట్టు తరపున సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా రైనా నిలిచాడు. మిస్టర్ ఐపీఎల్ గా అతనికి పేరుంది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి చిన్న తలాగా పేరు తెచ్చుకున్నాడు. 

సంజు శాంసన్ విషయానికి వస్తే అతను 2025 ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొలి రిటైన్ ప్లేయర్ గా శాంసన్ ను తీసుకోవడం దాదాపుగా ఖాయమైంది. అతనితో పాటు జైశ్వాల్ ను రెండో రిటైన్ ప్లేయర్ గా తీసుకోనున్నట్టు సమాచారం. ఐపీఎల్ 2024 లో రాజస్థాన్ రాయల్స్ జట్టును అద్భుతంగా నడిపించిన శాంసన్ ను మరోసారి నమ్ముకుంది.