కరువు పట్టి ఉన్నారు: సూరత్ to బ్యాంకాక్ ఫస్ట్ విమానం.. 4 గంటల్లో 15 లీటర్ల లిక్కర్ తాగేశారు

'ఫ్రీ'గా పోస్తామంటే ఎంతైనా తాగుతారు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. గుజరాత్‌లోని సూరత్ నుండి బ్యాంకాక్‌కు తన మొట్టమొదటి డైరెక్ట్ ఫ్లైట్‌ ప్రయాణం రికార్డుల్లోకెక్కింది. ఎలా అంటారా..! అందులోని ప్రయాణికులు.. వారం రోజులకు సరిపడా మద్యం ఒక్క ట్రిప్‌లోనే తాగేశారట. వారి తాగుడు చూసి ఎయిర్ ఇండియా సిబ్బంది సైతం ఆశ్చర్యపోయారట. అంత కరువులో ఉన్నారనమాట. 

175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ 737-8 విమానం గుజరాత్‌లోని సూరత్ నుండి బ్యాంకాక్ బయలుదేరింది. ఈ ప్రయాణ సమయం.. కేవలం నాలుగు గంటలు. విమానం ఎక్కిన పది నిమిషాలకే కొందరు ప్రయాణికులు మందు తాగడం మొదలు పెట్టారట. అలా మొదలైన వారి తాగుడు.. 'మద్యం అయిపోయింది..' అని విమాన సిబ్బంది ప్రకటన చేసేవరకు సాగింది. అయినప్పటికీ ప్రయాణికులు వదల్లేదట. మద్యం అయిపోయిన విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారని వినికిడి. 

15 లీటర్ల మద్యం

4 గంటల ప్రయాణంలో ప్రయాణికులు రూ.1.8 లక్షల విలువైన చివాస్ రీగల్, బకార్డి, బీర్‌తో సహా 15 లీటర్ల టాప్-షెల్ఫ్ మద్యం సేవించినట్లు విమాన సిబ్బంది తెలిపారు. ఆ మద్యం విలువ అక్షరాలా.. రూ. 1.8 లక్షలు. ప్రయాణికులు పిజ్జాలు, మద్యం సేవిస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.