న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ( కాంగ్రెస్ పార్టీ) ప్రమాణం చేశారు. బుధవారం పార్లమెంట్ లోని తన చాంబర్ లో రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ ఖఢ్ ఇటీవల ఎగువ సభకు ఎన్నికైన ఐదుగురు సభ్యులతో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్, బీజేపి చీఫ్ జేపి నడ్డా, కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ ఇతర నేతలు పాల్గొన్నారు. సీనియర్ నేత కే కేశవరావు రాజీనామాతో తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానం ఖాళీ అయింది.
ఇదే టైంలో తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 12 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలంగాణ నుంచి గత నెల 21 వరకు నామినేషన్లకు చివరి తేది ఉండగా, ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో గత నెల 28 న జరిగిన రాజ్య సభ ఉప ఎన్నికల్లో తెలంగాణ నుంచి సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తాజాగా ఆయనతో చైర్మన్ జగదీప్ ధన్ ఖఢ్ ప్రమాణం చేయించారు. సింఘ్వీ రాజ్యసభ సభ్యులుగా 2026 ఏప్రిల్ వరకు కొనసాగనున్నారు. ఇక సింఘ్వీనే కాకుండా.. మిగిలిన 11 స్థానాలకు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు.