తిరుపతన్న బెయిల్ పిటిషన్ పై విచారణ మళ్లీ వాయిదా

 

న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు మేకల తిరుపతన్న(మాజీ అడిషనల్ ఎస్పీ) బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని తిరుపతన్న హైకోర్టును ఆశ్రయించగా తిరష్కరించింది. దీంతో ఆయన.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ ఏడాది అక్టోబర్ 20న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను  జస్టిస్  బీవీ నాగరత్నం, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ల ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ దవే, మోహిత్ రావు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ది సిద్దార్థ్ లూథ్ర హాజరయ్యారు.

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసినందున గురువారం వాదనలు వినిపిస్తామని సిద్దార్థ్ దవే విన్నవించారు. ఈ విజ్ఞప్తిపై అభ్యంతరం తెలుపుతూ..  గురువారం తమకు కుదరదని సిద్దార్థ లూథ్ర కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. క్రిస్మస్ సెలవుల తర్వాత వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. ఇరువైపు వాదనలను విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను  జనవరి 2కు వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేసింది.