వైద్యసాయం తీసుకోండి.. రైతు సంఘాల నేత దల్లేవాల్​కు సుప్రీంకోర్టు ప్యానెల్

న్యూఢిల్లీ: పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధతతోసహా పలు డిమాండ్లతో పంజాబ్​ రైతుల తరఫున నిరాహార దీక్షకు దిగిన సంయుక్త కిసాన్​ మోర్చా(నాన్​పొలిటికల్) కన్వీనర్ జగ్జిత్​ సింగ్​ దల్లేవాల్​ను సుప్రీంకోర్టు ప్యానెల్​ కలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన జస్టిస్​ (రిటైర్డ్​) నవాబ్ సింగ్​ నేతృత్వంలోని కమిటీ సోమవారం మధ్యాహ్నం దల్లేవాల్​ను కలిసి, వెంటనే వైద్య సహాయం పొందాలని అభ్యర్థించింది. 

అనంతరం జస్టిస్​ నవాబ్ ​సింగ్ మీడియాతో మాట్లాడారు. దల్లేవాల్​ ఆరోగ్యంగా ఉండాలని తాము వాహేగురును ప్రార్థించినట్టు చెప్పారు. వైద్య సహాయం పొందడానికి దల్లేవాల్ ​అంగీకరించారా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘మేమందరం ఆయనను అభ్యర్థించాం. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం” అని సమాధానమిచ్చారు. 

ఈ ఆందోళనలు ముగిసిపోవాలని చెప్పడానికే తాను ఇక్కడికి వచ్చామని దల్లేవాల్​కు చెప్పామని, ఆయన ఆరోగ్యం బాగుండాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపామని అన్నారు. అయితే, తనకు వ్యవసాయమే ఫస్ట్​ అని, ఆ తర్వాతే ఆరోగ్యం అని దల్లేవాల్​ అన్నారని జస్టిస్​ నవాబ్​ సింగ్​ వెల్లడించారు. ఈ ఆందోళనకు ముగింపు పలుకుతామనే విశ్వాసంతోనే సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్​ సూర్యకాంత్​ ఈ కమిటీని నియమించారని చెప్పారు.