కవిత బెయిల్​ పిటిషన్​పై నేడు సుప్రీంలో విచారణ

  • ఢిల్లీకి వెళ్లి అడ్వకేట్లతో మాట్లాడిన కేటీఆర్​, హరీశ్​

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో అరెస్టయి తిహార్​ జైల్లో ఉంటున్న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​పై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్​లో ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు(ట్రయల్), ఢిల్లీ హైకోర్టు తిరస్కరించాయి. దీంతో ఈ కేసుల్లో మధ్యంతర బెయిల్ కోరుతూ ఈ నెల 7న ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

గతంలో రెండుసార్లు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్​ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బెయిల్​ ఇచ్చేందుకు నిరాకరించింది. కాగా, కవిత బెయిల్ పిటిషన్  సుప్రీం కోర్టు ముందుకు రానున్న నేపథ్యంలో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్​రావు సోమవారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. కవిత తరఫు అడ్వకేట్లతో వారు భేటీ అయ్యారు.