కౌంటింగ్ సెంటర్ కు వెళ్లొద్దు.. పిన్నెల్లికి సుప్రీం ఆదేశాలు..

ఏపీలో ఎన్నికల అనంతరం నెలకొన్న ఘర్షణలు రేపిన కలకలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన అల్లర్లు తీవ్ర కలకలం రేపాయి. ఈ అంశంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై పలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న పిన్నేల్లికి సుప్రీంకోర్టు మరో షాక్ ఇచ్చింది. కౌంటింగ్ రోజున పిన్నెల్లి కౌంటింగ్ సెంటర్ల వద్దకు వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు.

కౌంటింగ్ జరిగే పరిసరాలకు పిన్నెల్లి ఎట్టి పరిస్థితిలోను వెళ్లకూడదని స్పష్టం చేసింది ధర్మాసనం. టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా, పిన్నెళ్లిపై జూన్ 6వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఏపీహైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా తప్పుబట్టింది సుప్రీంకోర్టు. జూన్ 6న జరిపే విచారణలో అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని తగిన ఉత్తర్వులు ఇవ్వాలని, వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం.