‘సెంట్రల్ విస్టా’కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

‘సెంట్రల్ విస్టా’కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకు సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊపింది. ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీం తీర్పు వెలువరించింది. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్‌పై కేంద్రం వాదనలతో జస్టిస్‌ ఎ.ఎం. ఖన్విల్కర్‌ ధర్మాసనం ఏకీభవించింది. పర్యావరణ కమిటీ సిఫార్సు న్యాయమైనదని, చట్టబద్ధమైనదని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. కేంద్రం వాదనలతో జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ మహేశ్వరీ ఏకీభవించగా.. జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యతిరేకించారు. దీంతో 2-1 మెజారిటీతో సుప్రీం తీర్పు వెలువరించింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా స్మోక్ టవర్స్‌‌ను ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించింది. వాయు కాలుష్య సమస్య ఎదుర్కొంటున్న అన్ని నగరాల్లోనూ తదుపరి చేపట్టబోయే నిర్మాణ ప్రాజెక్ట్‌‌ల్లో స్మోక్ టవర్స్‌‌ను భాగస్వామ్యం చేయాలని పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలకు ఆదేశించింది. అయితే సుప్రీంలో విచారణ పెండింగ్‌‌లో ఉండగానే సెంట్రల్ విస్టా శంకుస్థాపనకు న్యాయస్థానం అనుమతించింది. కానీ ఇప్పుడే ఎలాంటి నిర్మాణాలను ప్రారంభించొద్దని స్పష్టం చేసింది. తుది తీర్పు వచ్చాకే చేపట్టాలని తెలిపింది. కేంద్రం కూడా దీనికే ఓకే చెప్పింది. గతేడాది డిసెంబర్ 10న ప్రధాని మోడీ సెంట్రల్ విస్టాకు శంకుస్థాపన చేశారు.