- ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ను విజేతగా ప్రకటించిన జడ్జిలు
- ఆర్వో అనిల్ మసీహ్ను ప్రాసిక్యూట్ చేయాలని ఆదేశం
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆప్, కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కుల్దీప్ కుమార్ ను విజేతగా ప్రకటించింది. సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారి కోర్టు రూమ్ లోనే బ్యాలెట్ పేపర్లను లెక్కించి విజేతను నిర్ధారించారు. ఓట్ల కౌంటింగ్ అనంతరం జడ్జీలే విజేతను ప్రకటించారు. ఎన్నికల కౌంటింగ్ లో తప్పులు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్, బీజేపీ లీడర్ అనిల్ మసీహ్ ను ప్రాసిక్యూట్ చేయాలని కోర్టు ఆదేశించింది. గత నెల 30న చండీగఢ్మేయర్ ఎన్నిక జరగ్గా, బీజేపీ నేత మనోజ్ సోంకార్ గెలిచినట్టు ఆర్వో అనిల్మసీహ్ప్రకటించారు. మొత్తం పోలైన ఓట్లలో 8 చెల్లవంటూ పక్కనపెట్టారు. అయితే బ్యాలెట్ పేపర్లపై ఆయన పెన్నుతో రాసిన వీడియో బయటకు వచ్చింది. దీనిపై ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారించి మంగళవారం తీర్పు ఇచ్చింది.
‘‘మేం ఎన్నికను రద్దు చేయడం లేదు. కేవలం కౌంటింగ్ ప్రక్రియలోనే తప్పులు జరిగాయి. రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మసీహ్ ఉద్దేశపూర్వకంగా 8 ఓట్లు చెల్లకుండా చేశారని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. అవన్నీ ఆప్ అభ్యర్థికి పడిన ఓట్లే. ఇలాంటి కుయుక్తుల ద్వారా ప్రజాస్వామ్యం నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో మేం కలగజేసుకోవాల్సిన అవసరం” అని బెంచ్ పేర్కొంది. బ్యాలెట్ పేపర్లను మరోసారి పరిశీలించిన బెంచ్.. కోర్టు రూమ్ లోనే బ్యాలెట్ పేపర్లను మళ్లీ లెక్కించాలని ఆదేశించింది. ఓట్ల లెక్కింపు అనంతరం ఆప్, కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కుల్దీప్ కుమార్ ను విజేతగా నిర్ధారించింది. ఆయనే చండీగఢ్ మేయర్ అని ప్రకటించింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మసీహ్ ను విచారించాలని, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ప్రజాస్వామ్య విజయం: కుల్దీప్ కుమార్
ఇది ప్రజాస్వామ్య విజయమని ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ అన్నారు. ‘‘బీజేపీ రిగ్గింగ్ చేయకపోయి ఉంటే, నేను ఈపాటికే మేయర్ అయ్యేవాడిని. ఆనాడు బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాను. ఈరోజు ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య విజయం.. చండీగఢ్ ప్రజల విజయం. నిజం గెలిచింది” అని పేర్కొన్నారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పుతో ఆప్ నేతలు సంబురాలు చేసుకున్నారు. స్వీట్లు పంచిపెట్టారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడారు: కేజ్రీవాల్
కష్టకాలంలో సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ సందర్భంగా కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’లో ఆయన పోస్టు పెట్టారు.
మేం ఎన్నికను రద్దు చేయడం లేదు. కౌంటింగ్ ప్రక్రియలోనే తప్పులు జరిగాయని తేల్చాం. రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మసీహ్ ఉద్దేశపూర్వకంగా 8 ఓట్లు చెల్లకుండా చేశారని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలున్నాయి. అవన్నీ ఆప్ అభ్యర్థికి పడిన ఓట్లే. ఇలాంటి కుయుక్తుల ద్వారా ప్రజాస్వామ్యం నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో మేం కలుగజేసుకోవాల్సిన అవసరం ఉంది. ‑ సుప్రీంకోర్టు
