ఇంట్లోని వస్తువుల్లా పిల్లలు ఆస్తి కాదు : సుప్రీం కోర్టు

  • మేజర్ అయిన కూతురు పెండ్లిని ఒప్పుకోవాలని  తల్లిదండ్రులకు సుప్రీం కోర్టు సూచన

న్యూఢిల్లీ: పిల్లలు మన ఇంట్లో వస్తువుల్లా వ్యక్తిగత ఆస్తులు కాదని.. వారి బంధాల్ని మనం అంగీకరించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. తన కూతురు ఇంకా మైనర్ అని ఆమె వివాహాన్ని రద్దు చేసి ప్రేమికుడిని శిక్షించాలని పిటిషన్ వేసిన తల్లిదండ్రులకు ఈ మేరకు సూచించింది. వివాహం చేసుకునే సమయానికి అమ్మాయి మేజర్​అని తెలిపింది. తన కూతురు మైనర్ అని మాయమాటలతో ఆమెను కిడ్నాప్​ చేసి, వివాహం పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ప్రేమికుడిపై మధ్యప్రదేశ్​రాష్ట్రం మహిద్​పూర్​కు చెందిన ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ కేసును మధ్యప్రదేశ్​లోని ఇండోర్​హైకోర్టు బెంచ్ ​విచారించి.. గత ఆగస్టు 16న తీర్పు చెప్పింది. పెండ్లి చేసుకున్న సమయంలో యువతి మేజర్ అని యువకుడిపై కేసును కొట్టివేసింది. దీంతో తమ కూతురు మైనర్​అని ఆమె పెండ్లి రద్దు చేయాలని యువకుడిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించాలని కోరుతూ యువతి తల్లిదండ్రులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ కేసును సీజేఐ సంజీవ్​కన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ బెంచ్​విచారించింది. ‘‘బిడ్డలు ఇంట్లో వస్తువుల్లా వ్యక్తిగత ఆస్తులు కాదు. వారిని శిక్షించే అధికారం మీకు లేదు. వారి అనుబంధాల్ని మీరు అంగీకరించాలి”అని సీజేఐ సంజీవ్ ఖన్నా తల్లిదండ్రులకు సూచించారు. తల్లిదండ్రులు సమర్పించిన బర్త్ సెర్టిఫికెట్​లో తేడాలు ఉన్నాయని తెలిపింది. అలాగే హైకోర్టు ఆర్డర్​ను పక్కన పెట్టేందుకు ఎటువంటి ఆధారం కనిపించడం లేదంటూ పిటిషన్​ను కొట్టేసింది.