న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అభిషేక్ బోయినపల్లి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తాను పెట్టుకొన్న బెయిల్ పిటిషన్లను కింది కోర్టులు తిరస్కరించడంతో అభిషేక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫు లాయర్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. అభిషేక్ దాదాపు 16 నెలలుగా జైలులో ఉన్నాడని బెంచ్ దృష్టికి తెచ్చారు.
లిక్కర్ కేసులో 50 వేల పేజీలతో దర్యాప్తు సంస్థలు 6 చార్జ్ షీట్లు దాఖలు చేశాయన్నారు. 50 మంది నిందితులు, 400 మందికి పైగా సాక్షులను విచారించారని గుర్తు చేశారు. అయినా, కేసు విచారణ పేరుతో పిటిషనర్ కు బెయిల్ మంజూరు ఆలస్యం చేయడంపై అభ్యంతరం తెలిపారు. అయితే, దర్యాప్తు సంస్థ తరఫున అడిషనల్ సోలిసిటరీ జనరల్ ఎస్వీ రాజు వాదనలకు సిద్ధంగా లేకపోవడంతో కేసు విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది.
