ఇద్దరు వేరు వేరు సమాధానాలు చెప్తే ఎలా..? లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు

  • దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు
  • తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం కామెంట్ 
  • లడ్డూల్లో కల్తీ జరిగిందని విచారణకు ముందే ప్రకటించారని ఏపీ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం  
  • లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారని  చెప్పేందుకు ఎలాంటి ఆధారాల్లేవని వెల్లడి 
  • తదుపరి విచారణ ఈ నెల 3కు వాయిదా 

న్యూఢిల్లీ, వెలుగు: దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొద్దని, క‌‌నీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగంగా ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లడ్డూల కల్తీపై ఎలాంటి ఆధారాలు ఉన్నాయో చూపాలని ఏపీ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ను ప్రశ్నించింది. ఈ వ్యవహరంలో కేంద్ర దర్యాప్తు అవసరమా? లేదా? అనే దానిపై కేంద్రప్రభుత్వ సూచనలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు చెప్పింది. తిరుమల లడ్డూల త‌‌యారీలో క‌‌ల్తీ నెయ్యిని వినియోగించార‌‌న్న వివాదంపై సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. 

టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి, చరిత్రకారుడు విక్రమ్ సంపత్, వేద వక్త దుష్యంత్ శ్రీధర్, సుదర్శన్ న్యూస్ యాంకర్ సురేశ్ పిటిషన్లు ఫైల్ చేశారు. వీటిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. దాదాపు గంటపాటు సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు.. ఈ సందర్భంగా కీలక కామెంట్లు చేసింది. 

మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా?

తిరుమల లడ్డూల్లో క‌‌ల్తీ జ‌‌రిగింద‌‌నే వాద‌‌న‌‌ను ధ్రువీకరించ‌‌డానికి ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు తెలిపింది. ల‌‌డ్డూలను త‌‌యారు చేయ‌‌డానికి జంతువుల కొవ్వు ఉన్న నెయ్యిని ఉప‌‌యోగించారని కచ్చితంగా నిర్ధారించేందుకు సీఎం వ‌‌ద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. ‘‘రిపోర్టుల ప్రకారం.. నెయ్యిలో కల్తీ జరిగినట్టు తేలింది. దానిపై మీరు (సీఎం) విచార‌‌ణ‌‌కు ఆదేశించిన‌‌ప్పుడు.. మీడియా ముందుకు వెళ్లాల్సిన అవ‌‌స‌‌రం ఏంటి? క‌‌నీసం దేవుళ్లనైనా రాజ‌‌కీయాల‌‌కు దూరంగా ఉంచండి” అని వ్యాఖ్యానించింది. ‘‘ల‌‌డ్డూల్లో క‌‌ల్తీ జ‌‌రిగింద‌‌ని నిర్ధారించారా? ల‌‌డ్డూల‌‌ను టెస్టింగ్‌‌కు పంపించారా? క‌‌ల్తీ నెయ్యిని లడ్డూల త‌‌యారీలో వినియోగించారా? అలా వినియోగించిన‌‌ట్టు ఆధారాలు లేవు కదా. విచార‌‌ణ జ‌‌ర‌‌గ‌‌కుండానే ల‌‌డ్డూ క‌‌ల్తీ జ‌‌రిగింద‌‌ని ప్రక‌‌ట‌‌న చేయ‌‌డం భ‌‌క్తుల మ‌‌నోభావాలను దెబ్బతీస్తున్నది” అని మండిపడింది.

భక్తుల మనోభావాలు దెబ్బతీశారు..

లడ్డూల త‌‌యారీలో కల్తీ నెయ్యి వినియోగించారని చెప్పేందుకు ప్రాథ‌‌మిక ఆధారాలేవీ లేవ‌‌ని సుప్రీంకోర్టు తెలిపింది. సీఎం చంద్రబాబు విచారణకు ముందే లడ్డూల్లో కల్తీ జరిగిందని ప్రకటించి, భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఫైర్ అయింది. విచార‌‌ణ జరుగుతున్న టైమ్ లో ప్రజాప్రతినిధులు ఇలాంటి ప్రక‌‌ట‌‌న‌‌లు చేస్తే, అది విచారణపై ప్రభావం చూపుతుంది కదా? అని ప్రశ్నించింది. ‘‘ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మ‌‌నోభావాల‌‌కు సంబంధించిన‌‌ అంశం. గ‌‌త సర్కార్ హయాంలో తిరుమల ల‌‌డ్డూల త‌‌యారీలో జంతువుల కొవ్వు ఉన్న నెయ్యిని వాడారని ఏపీ సీఎం చంద్రబాబు బ‌‌హిరంగ ప్రక‌‌ట‌‌న చేశారు. దీనిపై విచారణకు సిట్‌‌ ఏర్పాటు చేయడానికి ముందే ఆయన ఈ ప్రక‌‌ట‌‌న చేశారు.  విచార‌‌ణ‌‌కు ఆదేశించిన‌‌ప్పుడు ఉన్నత ప‌‌ద‌‌విలో ఉన్న వ్యక్తులు ప్రజ‌‌ల ముందు మాట్లాడ‌‌టం స‌‌ముచితం కాద‌‌ని భావిస్తున్నాం. 

కల్తీ నెయ్యిని లడ్డూల తయారీలో వినియోగించలేదని టీటీడీ ఈవో ప్రక‌‌ట‌‌న చేసిన‌‌ట్టు కొన్ని ప‌‌త్రికల నివేదిక‌‌లు చెబుతున్నాయి. ఈ విష‌‌యంలో సీఎంతో టీటీడీ ఈవో విభేదించారు. ఇద్దరి ప్రక‌‌ట‌‌న‌‌ల‌‌కు పొంత‌‌న లేదు” అని పేర్కొంది. ఈ అంశంపై అడిగిన ప్రశ్నలకు టీటీడీ తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా సమాధానం ఇవ్వలేదని, లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారని చూపించడానికి ఆధారాలేమీ లేవని తెలిపింది. అలాగే ఎన్ డీడీబీ రిపోర్టుపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. మరోవైపు సిట్ దర్యాప్తును కొనసాగించడానికి అనుమతించాలా? లేదా దర్యాప్తును వేరే ఏజెన్సీకి బదిలీ చేయాలా? అనేది కేంద్రాన్ని అడిగి చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 3కు వాయిదా వేసింది. 

రెండు ట్యాంకర్లవే టెస్టులకు పంపాం: సిద్ధార్థ్ లూథ్రా

అన్ని ట్యాంకర్ల శాంపిళ్లను టెస్టులకు పంపలేదని, రెండు ట్యాంకర్లవే పంపించామని టీటీడీ తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా కోర్టుకు తెలిపారు. ‘‘జులై 6, 12 తేదీల్లో స‌‌ర‌‌ఫ‌‌రా చేసిన ట్యాంక‌‌ర్లలోని నెయ్యి మాత్రమే టెస్టులకు పంపాం. ఆ శాంపిల్స్ ప్రకారం నెయ్యి కలుషితమైందని తేలింది. అదే సప్లయర్ గతంలో 4 ట్యాంకర్లు సరఫరా చేశాడు. ఆ నెయ్యిని లడ్డూల తయారీలో ఉపయోగించాం. కాబట్టి కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని భావించాం. దీనిపై దర్యాప్తు అవసరమని భావించిన ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది” అని చెప్పారు. దీనిపై స్పందించిన కోర్టు.. ‘‘ఎఫ్ఐఆర్ నమోదు, సిట్ ఏర్పాటుకు ముందే లడ్డూల్లో కల్తీ జరిగినట్టుగా సీఎం చంద్రబాబు ప్రకటన చేసినట్టు తెలుస్తున్నది. దర్యాప్తు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటన చేయడం మంచిది కాదు” అని పేర్కొంది.