ఇక్కడ ఎడ్యుకేషన్ పూర్తిగా ఫ్రీ

ఇక్కడ ఎడ్యుకేషన్ పూర్తిగా ఫ్రీ

సేవ చేయడమంటే సలోనికి ఇష్టం.అందుకే విదేశాల్లో ఉంటూ బిజీ లైఫ్ గడుపుతున్నా ఖాళీ సమయాల్లో రకరకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది. అయితే ఒకసారి ఆమె ఇండియాకు తిరిగొచ్చింది. ఇక్కడి పరిస్థితులు చూశాక ఆమె ఆలోచన మారింది. సేవ చేయాల్సిన అవసరం విదేశాల్లో కంటే ఇక్కడే ఎక్కువ ఉందని ఆమెకు అర్థమైంది. అంతే.. వెంటనే ఉద్యోగం మానేసి ఒక చిన్న ఎన్జీవో నడుపుతున్న స్కూల్‌‌లో చేరింది. మురికివాడల్లోని పిల్లల జీవితాలను మెరుగుపరుస్తూ ఇప్పుడు బిజీగా ఉంది.

ఢిల్లీకి చెందిన సలోని భరద్వాజ్ ఇంగ్లండ్‌‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్‌‌ షెఫీల్డ్‌‌’లో చదివింది. ఆ తర్వాత యూకేలోని బీబీసీ రేడియోలో పనిచేసింది. సలోని విదేశాల్లో ఉన్నప్పుడు ఎన్నోరకాల వలంటరీ యాక్టివిటీస్‌‌లో పాల్గొనేది. యూఎస్ వెళ్లి అక్కడ మహిళల కోసం సిన్సినాటి నిధుల సేకరణలో పాల్గొంది. తర్వాత ఆమె ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ వలంటీర్‌‌‌‌గా సేవ చేయడం కోసం ‘లోటస్ పెటల్’ అనే ఒక స్కూల్‌‌కు వెళ్లింది. చిన్న గదిలో ఉన్న ఆ స్కూల్లో ఏడుగురు పిల్లలు మాత్రమే ఉన్నారు. మురికివాడల్లోని పిల్లల కోసం నడుపుతున్న ఆ స్కూల్‌‌లో ఎలాంటి వసతులు, టీచర్లు లేకపోవడం చూసి దాన్ని మార్చాలనుకుంది. వెంటనే ఉద్యోగం మానేసి అందులో చేరింది. ఎంతో కష్టపడి ఆ స్కూల్ రూపురేఖల్ని పూర్తిగా మార్చేసింది.

అడ్వాన్స్‌‌డ్ ప్రోగ్రామ్స్
గురుగ్రామ్‌‌లోని మురికివాడలో మొదలైన ఈ స్కూల్‌‌లో ఏడుగురు స్టూడెంట్స్, ఒక మ్యాథ్స్ టీచర్ ఉండేవాడు. మూడు కంప్యూటర్లు మాత్రమే ఉండేవి. స్కూల్‌‌ను కిరాయి గదిలో నడిపే వాళ్లు. అయితే సలోని రాకతో ఈ స్కూల్ రూపం పూర్తిగా మారిపోయింది. నిధులు సేకరించి, విరాళాల సాయంతో స్కూల్‌‌ను వేరే బిల్డింగ్‌‌లోకి మార్చింది సలోని.  దాంతో స్కూల్‌‌లో స్టూడెంట్స్‌‌తో పాటు, ప్రోగ్రామ్స్ కూడా పెరిగాయి. ప్రస్తుతం ఈ స్కూల్‌‌లో 1,400 మంది స్టూడెంట్స్, 160 మంది స్టాఫ్ ఉన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు రెండు క్యాంపస్‌‌లు ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ పూర్తిగా ఫ్రీ. ఇందులో ఫౌండేషన్‌‌ టైలర్డ్‌‌ ప్రోగ్రాం, ప్రతిష్టాన్‌‌ లెర్నింగ్‌‌ సెంటర్‌‌, ఫాస్ట్‌‌-ట్రాక్‌‌ లెర్నింగ్‌‌ ప్రోగ్రామ్స్ వంటి అడ్వాన్స్‌‌డ్ ప్రోగ్రామ్స్‌‌ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ 11, 12 తరగతుల్లో కంప్యూటర్‌‌ బేసిక్స్‌‌, డేటా ఎంట్రీ, ఇంటర్నెట్‌‌ ప్రోటోకాల్‌‌ వంటి  ట్రైనింగ్ కోర్సులతో పాటు ఫిజిక్స్‌‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌‌ లాంటి ఇతర సబ్జెక్టులు కూడా ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మురికివాడల్లోని పిల్లల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేట్ తరహా మోడల్ స్కూల్ ఇది.  ఇక్కడి లెర్నింగ్ మెథడ్స్ ఎంత పాపులర్ అంటే.. వాటి కోసం ఇతర స్కూల్స్ కూడా లోటస్ పెటల్‌‌ స్కూల్‌‌ను కాంటాక్ట్ చేస్తుంటాయి.

ఇ– లెర్నింగ్
ఒక చిన్న గదిలో 2012లో మొదలైన ఈ స్కూల్​ ప్రస్తుతం ఐదు ఎకరాల స్థలంలో ఉంది. కార్పొరేట్ స్కూళ్లలో ఉన్న సౌకర్యాలతో పాటు సీబీఎస్‌‌ఇ సిలబస్ కూడా ఉంది. ఈ మధ్యనే ఇ–లెర్నింగ్‌‌ మాడ్యూల్‌‌ మొదలైంది. దీని ద్వారా రాజస్తాన్‌‌, ఒరిస్సా, ఉత్తరాఖండ్‌‌తో సహా ఐదు రాష్ట్రాల్లోని పిల్లలకు చదువు చెప్తున్నారు. త్వరలో మరిన్ని రాష్ట్రాలకు ఈ సదుపాయాలను విస్తరించే ఆలోచనలో ఉన్నామని స్కూల్ స్టాఫ్ చెప్తున్నారు.

వాళ్లకే మా ప్రయారిటీ
“నేను యూఎస్‌‌లో ఉన్నప్పుడు  రకరకాల వలంటరీ యాక్టివిటీస్‌‌లో పాల్గొనేదాన్ని. అయితే ఎన్ని చేసినా మనసులో ఎక్కడో వెలితి ఉండేది. మార్పుని ప్రత్యక్షంగా చూడగలిగే సెక్టార్‌‌లో పనిచేస్తే నిజమైన సంతృప్తి ఉంటుంది అనిపించింది. అందుకే ఇండియాకు బయలుదేరా. అక్కడ లోటస్ పెటల్ స్కూల్‌‌ను చూశాక నా  దృష్టి దానిపై పడింది. అందులో చేరి, స్కూల్‌‌కు కో-ఫౌండర్‌‌‌‌గా మారా. స్కూల్‌‌ను పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలనుకున్నా. ముందుగా సరైన పిల్లలు ప్రయోజనం పొందేలా చూసేందుకు కొన్ని రూల్స్ పెట్టాం. ఎలాంటి ఆస్తి లేదా వ్యాపారం లేని కుటుంబాల్లోని పిల్లలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. స్కూల్స్‌‌లో స్టూడెంట్స్‌‌కు హెల్దీ ఫుడ్ ఇస్తాం. మురికివాడల్లోని పిల్లల్లో మానసిక ఆందోళనలు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వాళ్ల మెంటల్ హెల్త్‌‌పై కూడా స్పెషల్ కేర్ తీసుకుంటాం. పిల్లలతో మాట్లాడేందుకు నలుగురు కౌన్సెలర్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా అవేర్‌‌‌‌నెస్ క్లాసులు చెప్తుంటాం. చదువుతో పాటు జెండర్‌‌, మెంటల్ హెల్త్ సమస్యలపై కూడా ఫోకస్ పెట్టాం. పిల్లల కుటుంబాల్లో ఉండే మూఢనమ్మకాలు, ఆడపిల్లలకు రుతుక్రమం గురించిన భయాలు పోగొట్టేలా రకరకాల అవగాహనా కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడి పిల్లలకు చదువుతో పాటు స్పోర్ట్స్, ఆర్ట్స్, నాటకాల లాంటివి కూడా నేర్పిస్తాం. త్వరలోనే స్కూల్ క్యాంపస్‌‌లు, ఇ–లెర్నింగ్ సౌకర్యాలను పెంచే ప్లాన్‌‌లో ఉన్నాం”. –సలోని భరద్వాజ్