సన్నిలియోన్‎కు రూ. వెయ్యి​ పింఛన్.. ఛత్తీస్ గఢ్‎లో బయటపడిన మోసం​

రాయ్​పూర్: సినీనటి సన్నిలియోన్​ఖాతాలో చత్తీస్ గఢ్​సర్కారు నెలనెలా రూ.వెయ్యి పింఛన్​జమ చేస్తున్నది. రికార్డుల్లో ఆమె పేరు, ఫొటో స్పష్టంగా ఉన్నాయి. ఓ వ్యక్తి ఫోర్జరీ డాక్యుమెంట్స్‎తో పింఛన్​కు అప్లై చేయగా.. అధికారులు గుడ్డిగా సంతకాలు చేయడంతో అర్హుల ఖాతాలో సన్నీలియోన్​పేరు చేరిపోయింది. బస్తర్ రీజియన్‎లోని తాలూర్ గ్రామంలో తాజాగా ఈ మోసం బయటపడింది. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించగా.. గ్రామానికి చెందిన వీరేంద్ర జోషి ఈ మోసానికి పాల్పడినట్టు తేలింది. చత్తీస్ గఢ్‎లోని బీజేపీ ప్రభుత్వం వివాహిత మహిళల కోసం ‘మహతారి వందన యోజన’ స్కీమ్‎ను అమలు చేస్తున్నది. 

దీనికింద నెలానెలా రూ. వెయ్యి పింఛన్​అందజేస్తున్నది. ఈ క్రమంలోనే ఓ యువకుడు సన్నిలియోన్​ఫొటో, ఆమె పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్స్​సృష్టించి అప్లై చేశాడు. అధికారులు కనీసం పరిశీలించకుండా ఓకే చేయడంతో.. ఆ ఖాతాలో ఈ ఏడాది మార్చి నుంచి నెలనెలా ఠంచన్‎గా వెయ్యి రూపాయల పింఛన్​ పడుతున్నది. కాగా, ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు వీరేంద్ర జోషిపై పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. పింఛన్​క్రెడిట్ అవుతున్న బ్యాంక్​ అకౌంట్‎ను ఫ్రీజ్​చేశారు. అతడికి సహకరించిన అంగన్​వాడీ టీచర్, సూపర్​వైజర్​పై క్రమశిక్షణా చర్యలకోసం ​ సిఫారసు చేశారు.