ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కడప రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతోంది. వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో నెలకొంటున్న పరిణామాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అవినాష్ రెడ్డికి పోటీగా బరిలోకి దోయగటంతో రాష్ట్రమంతా కడప ఎంపీ స్థానం పైనే ఉంది. ప్రస్తుతం కడప జిల్లాలో షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ అవినాష్, జగన్ లపై ప్రత్యక్షంగా విమర్శలు చేస్తున్న క్రమంలో రాజకీయం మరింత వేడెక్కింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల, సునీతలు పులివెందులలో పర్యటిస్తున్న క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివేకా హత్య గురించి మాట్లాడుతూ షర్మిల జగన్, అవినాష్ లపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఆమెను అడ్డుకొని జగన్ కు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వారిని అడ్డుకోవటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో సునీత కలుగజేసుకొని అల్లరి చేసేవాళ్ళు పులివెందుల పూల అంగళ్ల దగ్గరికి వస్తే అక్కడ తేల్చుకుందామని సవాల్ విసిరారు.