IND vs AUS: కోహ్లీ ఒక చరిత్ర.. మీ కథనాలతో అతని ప్రతిష్టను దిగజార్చలేరు: గవాస్కర్

విరాట్ కోహ్లీ- సామ్ కొంటాస్ మధ్య జరిగిన గొడవను ఉద్దేశిస్తూ.. ఆసీస్ మీడియా 'ది వెస్ట్ ఆస్ట్రేలియన్' పత్రిక భారత మాజీ కెప్టెన్‌ను అవమానించేలా కథనాన్ని ప్రచురించింది. "విదూషకుడు కోహ్లీ' అనే హెడ్‌లైన్‌తో కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ కథనాలపై భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోహ్లి అత్యుత్తమ ఆటగాడని, ఇటువంటి కథనాలతో అతని ప్రతిష్టను ఇసుమంతైనా దిగజార్చలేరని అభిప్రాయపడ్డారు.

విదూషకుడు అంటే.. హాస్యనటుడు, జోకర్, బఫూన్, హేళన చేసేవాడు అని అర్థం. ఇంకా చెప్పాలంటే.. ది వెస్ట్ ఆస్ట్రేలియన్ పత్రిక వార్తలో కోహ్లీని 'ఇండియన్ సూక్' అని సంభోదించింది. దీనర్థం ఏడుపుకుంటోడు లేదా పిరికివాడని. ఇటువంటి వార్తలు ప్రచురించి నాలుగు పత్రికలు ఎక్కువ అమ్ముకోవచ్చేమో కానీ, అభిమానుల్లో భారత క్రికెటర్‌కు ఉన్న ఆదరణను, అభిమానాన్ని ఎవరూ తగ్గించలేరని గవాస్కర్ అన్నారు. అడ్డగోలు కథనాలు ప్రచురించిన ఆసీస్ మీడియాపై అయన మండిపడ్డారు.

"విరాట్ కోహ్లీ ఒక చరిత్ర. అత్యుత్తమ ఆటగాడే కాదు.. కోట్లాది మంది అభిమానుల ఆదరణను చూరగొంటున్నవాడు. అతనికి వ్యతిరేకంగా మీరు ఈ పనులు చేయలేరు.." అని గవాస్కర్ అన్నారు. అంతేకాదు ఆసీస్ మీడియాను ఆతిథ్య జట్టుకు 12వ ఆటగాడు లాంటి వారని గవాస్కర్ ఎద్దేవా చేశారు.

ALSO READ | IND vs AUS: విదూషకుడు కోహ్లీ.. భారత స్టార్‌పై ఆసీస్ మీడియా అడ్డగోలు కథనాలు

బాక్సింగ్ డే టెస్ట్ తొలిరోజు ఆటలో విరాట్ కోహ్లీ - సామ్ కొంటాస్ మధ్య గొడవ జరిగింది. పిచ్ పక్కన నడిచే సమయంలో భారత బ్యాటర్.. ఆసీస్ యువ ఆటగాడి భుజాన్ని భౌతికంగా తాకుతూ నడిచి వెళ్లడం ఈ వాగ్వాదానికి దారితీసింది. ఈ వివాదంలో ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్.. భారత స్టార్‌దే తప్పని తేల్చారు. ఈ క్రమంలో కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించారు.