IND vs AUS 3rd Test: సచిన్‌ వీడియోలు చూసి నేర్చుకో.. కోహ్లీకి సునీల్ గవాస్కర్ సలహా

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆఫ్-స్టంప్ వెలుపల పడుతున్న బంతులను వెంటాడి మరోసారి తన వికెట్ పారేసుకున్నాడు. మరోసారి తన బలహీనతను బయట పెట్టి టీమిండియాకు కష్టాల్లో పడేశాడు. ఆఫ్-స్టంప్ కు దూరంగా వెళ్తున్న బంతులను హిట్ చేయాలని చూస్తూ.. కీపర్ లేదా స్లిప్ క్యాచ్ ఔట్ అవ్వడం తరచూ చూస్తూనే ఉంటాం. అతని మైనస్ పాయింట్ పూర్తిగా బౌలర్లు పసిగట్టారు. తాజాగా గబ్బాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో  సోమవారం (డిసెంబర్ 16) కోహ్లీ ఇదే సీన్ రిపీట్ చేశాడు.

ఇన్నింగ్స్ 8వ ఓవర్ రెండో బంతిని జోష్ హాజిల్‌వుడ్ ఆఫ్ స్టంప్ కు దూరంగా విసిరాడు. 5వ స్టంప్ పడ్డ బంతిని ఆడే క్రమంలో బంతి కోహ్లీ బ్యాట్‌కు ఎడ్జ్ అయి నేరుగా కీపర్ అలెక్స్ క్యారీ చేతిలోకి వెళ్లింది. దీంతో 3 పరుగులకే కింగ్ పెవిలియన్ కు చేరాడు. కోహ్లీ బలహీనతను గ్రహించిన టీమిండియా దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ విలువైన సలహా ఇచ్చాడు. సచిన్ ఆస్ట్రేలియాపై గతంలో తన బలహీనతను ఎలా అధిగమించాడో కోహ్లీ ఆ వీడియో చూసి ఫామ్ లోకి రావాలని నేర్చుకోవాలని సూచించాడు.

ALSO READ | IND vs AUS 3rd Test: ముగిసిన మూడో రోజు ఆట.. టీమిండియాను కాపాడిన వర్షం

"ఈ టెస్ట్ మ్యాచ్‌లో మరో ఇన్నింగ్స్ ఉంది. ఆ తర్వాత రెండు టెస్టులు ఉన్నాయి. విరాట్‌కు పరుగులు చేయడానికి తగినంత సమయం ఉంది. అతను ఈ సిరీస్ లో మూడు సార్లు చాలా మంచి డెలివరీలకు ఔటయ్యాడు. అయితే బ్రిస్బేన్‌లో చెత్త బంతికి ఔటయ్యాడు. కోహ్లీ బంతిని వదిలివేయడంలో విఫలమయ్యాడు". అని కోహ్లీ షాట్ సెలక్షన్ పై గవాస్కర్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. 

“సచిన్ గతంలో ఇలాంటి సమస్యలను ఎదర్కొన్నాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో ఆఫ్‌సైడ్‌ను ఆడకూడదని బలంగా నిర్ణయించుకున్నాడు. ఈ కారణంగానే సిడ్నీ టెస్టులో డబుల్ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాలో సచిన్ ఆడిన ఈ గొప్ప ఇన్నింగ్స్  వీడియో చూసి విరాట్ స్ఫూర్తిగా తీసుకోవాలని నేను భావిస్తున్నాను". అని గవాస్కర్ కోహ్లీకి సలహా ఇచ్చాడు. 

మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజ్ లో రాహుల్ (33), రోహిత్ శర్మ (0) ఉన్నారు. ప్రస్తుతం భారత్ 394 పరుగులు వెనకబడి ఉంది. మూడో రోజు వర్షం రావడం టీమిండియాకు కలిసి వచ్చింది. ఆసీస్ పేసర్లు విజృంభించడంతో నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. జైశ్వాల్(4), గిల్(1), కోహ్లీ (3) ,పంత్(9) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది.