బర్త్ డే పార్టీకి పిలిచి.. ముఖంపై మూత్రం పోసి దాడి.. బాలుడు సూసైడ్

బస్తీ(యూపీ)/ధార్: ఉత్తరప్రదేశ్‎లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు 17 ఏండ్ల బాలుడిని బర్త్ డే పార్టీకి పిలిచి.. బట్టలు ఊడదీసి, మొఖం మీద మూత్రం పోసి దాడిచేశారు. దీంతో అవమానం భరించలేక ఆ బాలుడు సూసైడ్ చేసుకున్నాడు. బస్తీ జిల్లాలోని కెప్టెన్‌‌‌‌గంజ్ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సంత్ కబీర్ నగర్ జిల్లాకు చెందిన బాలుడు.. బస్తీ జిల్లాలోని తన మేనమామ ఇంట్లో ఉంటున్నాడు. ఈ నెల 20వ తేదీ రాత్రి ఓ గ్రామస్థుడు బాలుడిని బర్త్​డే పార్టీకి పిలిచాడు. అతడు అక్కడికి చేరుకున్న తర్వాత నలుగురు వ్యక్తులు అతని బట్టలు విప్పి, ముఖంపై మూత్రం పోసి దాడిచేశారు.

ఆ ఘటనను  మొత్తం వీడియో తీశారు. అయితే, ఆ వీడియో సోషల్​మీడియాలో వైరల్ అవుతుందని, దాంతో తన పరువుపోతుందని భయపడిన ఆ బాలుడు.. ఘటన గురించి తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. దాంతో వారు కెప్టెన్‌‌‌‌గంజ్ పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేయలేదు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ బాధను తట్టుకోలేక సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో బాధితుడు ఉరివేసుకుని చనిపోయాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని బాలుడి డెడ్​బాడీని పోలీస్ స్టేషన్‌‌‌‌కు తీసుకువచ్చారు. 

అయినా, పోలీసుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అనంతరం వారు బాలుడి డెడ్​బాడీని ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బాలుడి తల్లి మాట్లాడుతూ.. నిందితులు వారి ఉమ్మిని నాకాలని తన కొడుకును వేధించారని ఆమె తెలిపారు. అంతేకుండా వీడియో డిలీట్ చేయాలని కోరినా వారు వినిపించుకోలేదని చెప్పారు. అలాగే, నిందితులపై కెప్టెన్‌‌‌‌గంజ్ ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌ఓ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎస్పీకి వివరించారు. కాగా, కెప్టెన్‌‌‌‌గంజ్ ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌ఓను సస్పెండ్ చేశామని, శాఖాపరమైన చర్యలు ప్రారంభించామని మంగళవారం ఎస్పీ కృష్ణ గోపాల్ తెలిపారు.

పరీక్ష హాల్‎లో ఫోన్‎తో దొరకడంతో..

మధ్యప్రదేశ్‎లో పరీక్ష రాస్తూ ఫోన్​తో దొరికిన పదో తరగతి స్టూడెంట్.. స్కూల్ మేనేజ్ మెంట్ మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ధార్ జిల్లాలోని ఉతావాద్ గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన స్టూడెంట్ ధార్ పబ్లిక్ స్కూల్​లో పదో తరగతి చదువుతున్నాడు. స్కూల్లో ప్రీ–బోర్డు ఎగ్జామ్స్ రాస్తూ ఆ స్టూడెంట్ ఫోన్​తో దొరికాడు. దీంతో స్కూల్ మేనేజ్ మెంట్ ఫోన్ స్వాధీనం చేసుకుని మందలించింది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన స్టూడెంట్.. ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా రూమ్​లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు.