Maa Nanna Superhero: 'మా నాన్న సూపర్‌ హీరో' మూవీ రివ్యూ.. సుధీర్‌బాబు ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్‌‌‌‌‌‌తో డైరెక్టర్ అభిలాష్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా ఇవాళ శుక్రవారం (అక్టోబర్ 11న) థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

తండ్రీ కొడుకుల ఎమోష‌న్‌తో తెర‌కెక్కిన ఈ మూవీతో సుధీర్ బాబు హిట్టు కొట్టాడా? ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌‌‌‌ను కంటిన్యూ చేసే బాక్సాఫీస్ స‌క్సెస్ ఫార్ములతో.. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి మెప్పించాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

కథేంటంటే:

జానీ (సుధీర్ బాబు) పుట్టుకతోనే త‌ల్లికి దూర‌మ‌వుతాడు. ఓ లారీ డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే తండ్రి ప్రకాశ్ (సాయిచంద్) గంజాయి కేసులో జైలు పాల‌వ్వ‌డంతో జానీ అనాథ‌గా మారిపోతాడు. దీంతో జానీ చిన్నతనం నుంచి అనాథ‌శ్ర‌మంలో పెరుగుతాడు. ఆ అనాథాశ్రమం నుంచి పిల్లలు లేని స్టాక్ బ్రోక‌ర్‌ అయిన శ్రీనివాస్‌ (షాయాజీ షిండే) జానీని దత్తత తీసుకుని పెంచుకుంటాడు. కానీ జానీని దత్తత తీసుకున్న తర్వాత అతనికి వ్యాపారాల్లో నష్టం రావడం, ఊరంతా అప్పులు చేయడం మొదలవుతాయి. ఇక జానీ రావడం వల్లే తనకు దురదృష్టం అని భావించి.. కొన్నాళ్ల తర్వాత కొడుకుని పట్టించుకోవడం పూర్తిగా మానేస్తాడు. అంతేకాకుండా జానీ ఇంటికి వచ్చాకే శ్రీనివాస్ భార్య (ఆమ‌ని) చ‌నిపోతుంది. ఇక కొడుకు వ‌ల్లే త‌న జీవితం నాశ‌న‌మైంద‌ని జానీని పూర్తిగా ద్వేషిస్తుంటాడు శ్రీనివాస్‌. కానీ, జానీ మాత్రం ఓ అనాథగా బ్రతికే నాకు.. కుటుంబాన్ని ఇచ్చిన శ్రీనివాస్‌ను సొంత తండ్రి కంటే ఎక్కువ‌గా ప్రేమిస్తు..ఆరాధిస్తుంటాడు. శ్రీనివాస్ ఎంత ద్వేషిస్తే అంత‌కుమించి తండ్రిపై జానీ ప్రేమ‌ను కురిపిస్తుంటాడు.

అలా ఓ సమయంలో లోకల్ లీడర్ కి శ్రీనివాస్ కోటి రూపాయలు కట్టాల్సి వస్తుంది. దీంతో ఆ లీడర్‌ శ్రీనివాస్‌పై ఛీటింగ్‌ కేసు పెట్టగా, పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చితక్కొడుతుంటారు. ఈ విషయం తెలిసి జానీ తన తండ్రిని కాపాడుకునే ప్రయత్నంలో చాలా విధాలుగా పోరాడుతాడు. ఇక తన తండ్రిని వదిలేయాలంటే కోటీ రూపాయలు కట్టాలని చెప్పడంతో.. ఆ డబ్బుల కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. దీంతో తండ్రిని ర‌క్షించుకునేందుకు ఆ అప్పు బాధ్య‌త‌ను త‌న భుజానికెత్తుకుంటాడు.

కట్‌ చేస్తే 20ఏళ్ల త‌ర్వాత జైలు నుంచి విడుదలైన ప్రసాద్‌ తన కొడుకు కోసం వెతుకుతుంటాడు. అతని పేరు కూడా తెలియకపోవడంతో ఎలా వెతకాలో కూడా అర్థంకాక బాధపడుతుంటాడు. ఒకవైపు డబ్బుల కోసం జానీ, మరోవైపు కొడుకు జాడ కోసం ప్రకాష్ ఇలా ఒకరికొకరు తమ ప్రయత్నాలు ఎలా చేశారు? మరి జానీ పెంచినతండ్రి అప్పులను తీర్చాడా? కన్నతండ్రిని కలుసుకున్నాడా? ప్రసాదే తన సొంత నాన్న అని జానీకి ఎలా తెలుస్తోంది?  అసలు ప్రకాష్ జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనే తదితర విషయాలు తెలియాలంటే థియేట‌ర్ల‌లో సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే::

"మా నాన్న సూపర్ హీరో".. కథకి తగిన టైటిల్ను ఎంచుకుని సక్సెస్ అయ్యారు డైరెక్టర్ అభిలాష్. టాలీవుడ్‌, బాలీవుడ్ ఇలా ప్రతి సినిమా ఇండ‌స్ట్రీల‌లో తండ్రీకొడుకుల అనుబంధంతో తెరకెక్కిన సినిమాలు సక్సెస్ సాధిస్తూ ఉంటాయి. తండ్రి కోసం తపన పడే హీరోల స‌క్సెస్ ఫార్ములా ఎప్పటునుంచో వస్తున్నదే. అంతేందుకు.. రీసెంట్ గా వ‌చ్చిన బాలీవుడ్ మూవీ యానిమ‌ల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా వెయ్యి కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అంతలా ఉంటుంది తండ్రీకొడుకుల అనుబంధంతో వచ్చిన సినిమాల ఇంపాక్ట్. 

ఓ కొడుకు.. ఇద్ద‌రు తండ్రులు.. ఇదోరకంగా ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌ అని చెప్పొచ్చు. మ‌న‌సుల్ని హ‌త్తుకునేలా ఓ భావోద్వేగ‌భ‌రిత‌మైన సినిమాని చూపించ‌ద‌గ్గ కంటెంట్ ఉన్న సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్. దూర‌మైన త‌న కొడుకు ప్రేమ కోసం ప‌రిత‌పించే కన్న తండ్రి...ద‌గ్గ‌రున్న కొడుకును అనుక్ష‌ణం ద్వేషించే ద‌త్త‌త తీసుకున్న‌ తండ్రి...వారి మ‌ధ్య‌ ఓ కొడుకు జీవితం ఎలా సాగింద‌నే అంశాల‌తో బావోద్వేగపు స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఎమోష‌న‌ల్ గా తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు విధానం  మెచ్చుకోదగినది.

ఇక ఈ సినిమా ఫస్టాఫ్‌లో సాయిచంద్‌ తన కొడుకు పుట్టగానే భార్య చనిపోవడంతో కొడుకుని తనే చూసుకోవాల్సి వస్తుంది. కానీ తన పేదరికం వల్ల పసిపిల్లాడికి కనీసం పాల డబ్బాలు కూడా కొనలేని స్థితిలో ఉండిపోతాడు. డ్రైవర్‌గా చేసే అతను, డ్రైవర్‌గా ఓ ట్రిప్‌ కి వెళ్తే ఉద్యోగం ఇస్తారని చెప్పడంతో కొడుకుని బాగా చూసుకోవచ్చు అని, కొన్ని రోజులు అనాథశ్రమంలో ఉంచి వెళ్తాడు. కానీ తనకు తెలియకుండానే గంజా కేసులో ఇరికిపోవడం వల్ల జైలు పాలవ్వడం.. కొడుకు ఎలా బ్రతుకుతాడు అని బెంగపెట్టుకోవడం..ఆ బాధతోనే కొడుక్కి మంచి లైఫ్‌ ఇవ్వాలని లాటరీ టికెట్లు కొంటూ ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. అలాగే పెంచిన తండ్రి శ్రీనివాస్ ఎంత చీదరించుకున్నా జానీ మాత్రం తండ్రి కోసం నిలబడుతూ ఉండటం.. ఇంతలో అసలు తండ్రి ప్రకాష్ తన కొడుకుని వెతుక్కుంటూ రావడం.. మరోవైపు డబ్బుల కోసం హీరో ప్రయత్నాలు చేయడం వంటి సీన్స్ తో ఇంటర్వెల్ ఆసక్తిగా నడిపించాడు డైరెక్టర్. 

ఇక సెకండ్ హాఫ్ లో ఓ లీడర్ కి కోటి రూపాయలు ఎలా సంపాదించాలో తపన పడే కొడుకుగా చూపిస్తూనే.. మరో వైపు ప్రకాష్ వద్ద ఓ కోటిన్నర లాటరీ టికెట్ ఉండటం, దాని కోసం కొంతమంది వెంటపడటం, ప్రకాష్, జానీ మధ్య జరిగే సంఘటనలు ఉత్కంఠ రేపేలా సాగడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటోంది. అంతేకాకుండా ఆర్థిక అవ‌స‌రాలు మ‌నిషిని ఎలా స్వార్థ‌ప‌రుడిగా మారుస్తాయ‌నే చిన్న సందేశాన్ని ఈ సినిమాలో చూపిస్తూ.. క్రైమ్, ల‌వ్ ఎలిమెంట్స్‌కు క‌థ‌కు లింక్ చేయడం అందరికీ నచ్చే అంశం.

`మా నాన్న సూపర్‌ హీరో`మూవీ కథ పరంగా బరువైన భావోద్వేగాలతో కూడిన కథ. అంతే ఎమోషనల్‌గా ప్రేక్షకులకు నచ్చే విధంగా డైరెక్టర్ చేసిన ప్రయత్నం సినిమాపై మరింత బలాన్ని చేకూర్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే ద‌ర్శ‌కుడు అభిలాష్ రెడ్డి తాను చెప్పాల‌నుకున్న క‌థ‌ను నిజాయితీగా చెప్పి..ప్రేక్షకుల హృదయాలను కంటతడి పెట్టించడంలో సక్సెస్ అయ్యాడు. సుధీర్ బాబులో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. 

ALSO READ : Vishwam Twitter X Review: 'విశ్వం' ట్విట్టర్ రివ్యూ.. గోపీచంద్, శ్రీనువైట్లకు ఈసారి హిట్ రాసిపెట్టి ఉందట!

మొత్తానికి ఈ సినిమాలో సుధీర్ బాబు-సాయిచంద్ ఒకరితో ఒకరు పోటీ పడి నటించడంతో ‘మా నాన్న సూపర్ హీరో’ నిజాయితీగా చెప్పిన కథ. క్లైమాక్స్ సంతోషకరమైన ముగింపుతోనే ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తుంది. లాస్ట్ 30 నిముషాలు దర్శకుడు డీల్ చేసిన ఎమోషన్ సీన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోతారు. కళ్లలో తడితో.. గుండె నిండిన ఫీలింగ్ తో థియేటర్ నుంచి బయటికి డైరెక్టర్ అభిలాష్ కథనం నడిపించడంతో బెస్ట్ ఎమోషనల్ మూవీస్ లో ‘మా నాన్న సూపర్ హీరో’ ఒకటిగా నిలుస్తోందని చెప్పొచ్చు. 

ఎవరెలా చేశారంటే::

జానీ పాత్ర‌లో సుధీర్‌బాబు ఒదిగిపోయాడు. గ‌త సినిమాల‌కు భిన్నంగా ఔట్ అండ్ ఔట్ ఎమోష‌న‌ల్ రోల్‌లో సుధీర్‌బాబు నటించడంతో.. నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. బాధ, కోపం, ఆవేదన, నిస్సాయత వంటి ఫీలింగ్స్ తో ఆడియన్స్ ను మెప్పిస్తాడు. దూర‌మైన కొడుకును క‌లుసుకోవాల‌ని ఆరాట‌ప‌డే తండ్రి పాత్ర‌లో సాయిచంద్ జీవించేసాడు. షాయాజీ షిండే తన యాక్టింగ్ తో సినిమాకి మరింత బలాన్ని ఇచ్చాడు.సీరియస్ పాత్రలో కొంచెం కొత్తగా కనిపిస్తాడు. ఇకపోతే క‌థానాయిక పాత్ర‌కు ఈ క‌థ‌లో ప్రాధాన్యం లేదు. ఎందుకంటే, మూడు పాత్రలు మధ్యే సినిమా అంతా నడుస్తుంది. ఆర్న వోహ్రా, రాజు సుందరం, విష్ణు.. మిగిలిన పాత్రలు అందరికి తక్కువ స్కోప్ దక్కినా వారి పాత్రల్లో బాగానే నటించారు.

సాంకేతిక అంశాలు::

మా నాన్న సూప‌ర్ హీరో మూవీతో కెరీర్‌లో గుర్తుండిపోయే ఒక మంచి సినిమా తీశాడు డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర. సింపుల్ స్క్రీన్ ప్లేతో ఎమోషనల్ కథను రాసుకొని అభిలాష్ తెరకెక్కించిన విధానం కంటతడి పెట్టిస్తోంది. రచయిత గానే కాక డైరెక్టర్ గాను సక్సెస్ అయ్యాడు.  మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కథకు మరింత బలాన్ని ఇచ్చింది. పాటలు కూడా బాగున్నాయి. సమీర్‌ కళ్యాణి కెమెరా వర్క్ బాగుంది. నిర్మాతలు ఈ సినిమాని ఉన్నతంగా నిర్మించారు.