AP Weather Alert: గుంటూరులో భారీ వర్షం

గుంటూరు జిల్లాలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. జిల్లాలోని తాడికొండ, ప్రత్తిపాడు,మేడికొండతో పాటు గుంటూరు సిటీ ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. భారీ వర్షం కారణంగా జిల్లా వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. ఈ క్రమంలో ఏటుకూరు వద్ద జరగనున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం సభా ప్రాంగణం అంతా చిత్తడిగా మారింది. అప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్న కార్యకర్తలు, ప్రజలు వర్షం కారణంగా ఇబ్బంది పడ్డారు.వర్షం సమయంలో ఈదురుగాలుల వల్ల సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన హోర్డింగులు కూలిపోయాయి. ఉదయం నుండి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారటంతో ప్రజలు కాసేపు ఇబ్బంది పడ్డారు. కాగా, గత కొంత కాలంగా విపరీతమైన ఎండలు, వేడి గాలుల వల్ల ఇబ్బందిపడుతున్న జనానికి ఈ వర్షం వల్ల కాస్త ఉపశమనం లభించినట్లయింది.