రక్షాబంధన్ : ఆవు పేడ రాఖీలు.. రూ.25 లక్షలు సంపాదించిన మహిళలు

ఆగస్టు 19న రాఖీ పండుగ.. ఇది అనుబంధాలకు ప్రతీకగా నిలిచే ఉత్సవం. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీ కడతారు. ఇందుకోసం ఇప్పటి నుంచే మార్కెట్లో వివిధ రకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఉత్తరప్రదేశ్​ జలౌన్‌ జిల్లాలోని చమరి  గ్రామానికి చెందిన మహిళలు గోమయం( ఆవుపేడ)తో  రూపొందిస్తున్న రాఖీలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

యూపీలోని జలౌన్ జిల్లా మహిళా సాధికారతకు నిదర్శనంగా మారుతోంది.  ఇక్కడి మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఏడాదికి రూ. 20 నుంచి 25 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఆవుపేడతో రాఖీలను అందంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ ఏడాది వీరు తయారు చేసిన అయోధ్య రామ మందిర నమూనాగల రాఖీలకు అత్యంత గిరాకీ ఉందని సంస్థ నిర్వాహకురాలు వినీత తెలిపారు. 

ఆవు పేడలో వివిధ రకాల పప్పుదినులు కలిపి ఆమె అందమైన రాఖీలను తయారు చేస్తున్నారు. . ఈ రాఖీలు పర్యావరణానికి అనుకూలమైనవి. ఇలానే ఎవరైనా సరే ఇటువంటి రాఖీలను తయారు చేసి ఉపాధి పొందవచ్చని నిర్వాహక  సంస్థ అధ్యక్షురాలు వినీతా పాండే చెబుతున్నారు. తమ సంస్థ రూపొందిస్తున్న రాఖీలు అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయని వినీత తెలిపారు.

ఉత్తరప్రదేశ్​ జలౌన్‌ జిల్లాలోని చమరి  గ్రామానికి చెందిన మహిళలు  తయారు చేస్తున్న రాఖీలు దేశంలోని ప్రతి ప్రాంతానికి ఎక్స్​పోర్ట్​ అవుతున్నాయని ఆమె అన్నారుజ. ఢిల్లీ, గుజరాత్, ముంబైల నుంచి తనకు చాలా ఆర్డర్లు వస్తున్నాయని  పేర్కొన్నారు. తాను ఈ రాఖీలను రూ.40కు విక్రయిస్తున్నానని తెలిపారు. తాను ఈ ప్రత్యేకమైన రాఖీలను రూపొందించేందుకు ఆవు పేడ, ఎర్రమట్టి, బంక, పప్పుదినులు ఉపయోగిస్తామని తెలిపారు. దీంతో పాటు ఆవాలు, నువ్వులు, బంతిపూలు మొదలైనవాటిని కూడా వినియోగిస్తానని తెలిపారు.