హైదరాబాద్లోని విద్యా సంస్థల సక్సెస్ స్టోరీ

హైదరాబాద్​ రాజ్యాన్ని అస్​ఫ్​జాహీలు 224 సంవత్సరాలు పాలించారు. ఏడుగురు నిజాం పాలకుల్లో తొలి ఐదుగురి కాలంలో విద్యాభివృద్ధికి పెద్దగా కృషి జరగలేదు. ఆరో నిజాం మీర్​ మహబూబ్​ అలీఖాన్​లో బ్రిటీష్ వారి సహకారంతో విద్యా సంస్థల ఏర్పాటుకు కృషి జరిగింది. ముఖ్యంగా మహబూబ్​ కళాశాల, మహిళల కోసం మహబూబియా కాలేజ్​ ఆయన కాలంలోనే ఏర్పాటయ్యాయి. మీర్​ మహబూబ్​ అలీఖాన్​ కాలంలోనే నిజాం కాలేజ్​ ఏర్పాటయింది. ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ కాలంలో సిటీ కాలేజ్​ నిర్మించారు. ఇతని కాలంలో నిర్మించిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం మేటి విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలిచింది.

మహబూబ్​ కళాశాల

బ్రిటీష్​ వారి కాలంలో సైనికుల పిల్లల కోసం సికింద్రాబాద్​లో సెయింట్​ ఆన్స్​ పాఠశాల, సెయింట్​ ఆన్స్​ కాన్వెంట్​ ఏర్పాటు చేశారు. రెజిమెంటల్​ బజార్​, జేమ్స్​ స్ట్రీట్స్​, కళాసిగూడ ప్రాంతాల్లో ఆంగ్లేయతరులు అధిక శాతం నివసించేవారు. వీరికి తగిన విద్యావకాశాలు ఉండేవి కావు. కంటోన్మెంట్​కు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్​గా ఉన్న పి.సోమసుందరం మొదలియార్​ బ్రిటీష్​ అధికారుల సహాయంతో 1862లో ఆంగ్లో వెర్నాక్యులర్​ స్కూల్ ను ​సికింద్రాబాద్​లో ఏర్పాటు చేశారు. 

ఈ పాఠశాలకు ఆరో నిజాం మీర్​ మహబూబ్​ అలీఖాన్​ నిధులు సమకూర్చడంతోపాటు ప్రతి ఏడాది పాఠశాల నిర్వహణకు తగిన గ్రాంటు మంజూరు చేసేవారు. దీంతో ఈ పాఠశాల పేరును ఆరో నిజాం పేరిట మహబూబియా స్కూల్​గా మార్చారు. ఇది ప్రస్తుతం మహబూబ్​ కళాశాల స్థాయికి ఎదిగింది. ఈ కళాశాలకు రఘుపతి వెంకటరత్నం నాయుడు, మాడపాటి హనుమంతరావు ప్రిన్సిపాల్​గా పనిచేశారు. స్వామి వివేకానంద 1893, ఫిబ్రవరి 13న స్థానిక ప్రజలనుద్దేశించి ఈ కళాశాల ప్రాంగణం నుంచే ప్రసంగించారు.

మహబూబియా కళాశాల

ఆరో నిజాం హైదరాబాద్​ నగర మహిళలకు బహుమతిగా మహబూబియా కళాశాలను స్థాపించారు. నిజాం ఆస్థానంలో పనిచేసే సర్​ జార్జ్​ కాసన్​ వాకర్​, ఆయన​ భార్య కేస్సన్​ వాకర్ల ప్రోత్సాహంతో నిజాం ఈ కళాశాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ పాఠశాల నిర్వహణ కోసం ప్రభుత్వ ఖాజానా నుంచి నెలకు రూ.1000 మంజూరు చేసేవారు. పాఠశాల నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అధ్యక్షురాలిగా కేస్సన్​ వాకర్​ వ్యవహరించేవారు. కమిటీ సభ్యులుగా లేడీ అక్బర్​ హైదరీ, సరోజిని నాయుడు, నండి భార్య, శ్రీమతి సోరాబి జంషెడ్​జీ భార్య మొదలైనవారు ఉన్నారు. 

1907, ఫిబ్రవరి 1న నాంపల్లి రైల్వేస్టేషన్​కు ఎదురుగా ఉన్న ప్రైవేట్​ భవనంలో మహబూబియా కళాశాలను ఆరో నిజాం పేరు మీదుగా ఏర్పాటు చేశారు. ఈ కళాశాలకు తొలి ప్రిన్సిపాల్​గా ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయంలో చదువుకున్న జెఫ్రీని నియమించారు. 1930 నుంచి 1947 వరకు గ్రేస్​ లినెల్లీ ఈ కళాశాలకు ఆఖరి ఆంగ్లేయ ప్రిన్సిపాల్​గా ఎంతో సేవలందించారు. 

ఉస్మానియా యూనివర్సిటీ

ఉర్దూ భాష మాధ్యమంగా విద్యా బోధన కోసం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని ఆ నాటి ఇద్దరు మేధావులు జనాబ్​ రఫత్​ యార్జంగ్​, జనాబ్​ జామాలుద్దీన్​లు నిర్ణయించారు. జనాబ్​ జమాలుద్దీన్​ అఫ్గానీ 1882లో పారిస్​ వెళ్లి అక్కడ బ్రిటీష్ పార్లమెంట్​ సభ్యుడైన బ్లంట్​ను కలిసి విశ్వవిద్యాలయ ఏర్పాటు ప్రతిపాదనలపై తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. బ్లంట్​ ఆనాటి నిజాం సంస్థానంలోని రెండో సాలార్​జంగ్ ను కలిసి విశ్వవిద్యాలయ ఏర్పాటు గురించి చర్చించి, ఆరో నిజాం మీర్​ మహబూబ్​ అలీఖాన్​కు 1883, జనవరి 24న లిఖితపూర్వక ప్రతిపాదనలు అందజేశారు. 

1913లో దార్​–ఉల్​–ఉలూం పేరిట ఆనాటి విద్యార్థులంతా ఒక సంఘంగా ఏర్పడి విశ్వవిద్యాలయాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ఏడో నిజాంను డిమాండ్​ చేశారు. 1917లో ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్ యూనివర్సిటీ ఏర్పాటుకు అంగీకరించి ప్రభుత్వ ఉత్తర్వు విడుదల చేశారు. 1918లో యూనివర్సిటీని స్థాపించి 1919, ఆగస్టు 7న ఉస్మానియా యూనివర్సిటీ అనే పేరుతో ప్రస్తుత ఆబిడ్స్​ ప్రాంతంలో ఒక అద్దె భవనంలో తరగతులను ప్రారంభించారు. సర్​ పాట్రిక్​ గెడ్డెస్ ఆధ్వర్యంలో అడిక్​మెట్​ ప్రాంతంలో 1400 ఎకరాల భూమిని విశ్వవిద్యాలయానికి కేటాయించారు. హైదరాబాద్​కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్టు​లు నవాబ్​ జైన్​ యార్​జంగ్​, సయ్యద్​ అలీ రజాలు అనేక దేశాల్లో పర్యటించి ఈజిప్టుకు చెందిన జాస్పర్​ను యూనివర్సిటీ నిర్మాణానికి డిజైన్​ తయారు చేయమని కోరారు. 

1931లో జాస్ఫర్​ హైదరాబాద్​కు వచ్చి నగరంలోని ప్రాచీన కట్టడాలను సందర్శించి ఆనాటి సంస్కృతిని మేళవించేలా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్​ కళాశాల భవనాల నమూనాను రూపొందించాడు. 1934, జులై 5న ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్మాణ పనులను ఏడో నిజాం లాంఛనంగా ప్రారంభించారు. ఐదున్నర సంవత్సరాలపాటు 35 వేల మంది కార్మికులు శ్రమించి ఈ భవన నిర్మాణాన్ని 1939, డిసెంబర్ 5 నాటికి పూర్తి చేశారు. ఆర్ట్స్​ కళాశాల భవనాన్ని 110 మీటర్ల వెడల్పు, 119 మీటర్ల ఎత్తున రెండంతస్తులుగా నిర్మించారు. 1919లో ఇంటర్మీడియల్​ తరగతులు ప్రారంభించి,1921 నాటికి బీఏ, 1923 నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్​ తరగతులు ప్రారంభించారు. ప్రారంభంలో తరగతులు ఉర్దూ మాధ్యమంలో కొనసాగినా స్వాతంత్ర్యోద్యమంలో బోధన ఇంగ్లీష్​లో జరిగింది.


సిటీ కాలేజ్​

మూసీ నది తీరంలో ముస్లిమ్​జంగ్​ బ్రిడ్జికి సమీపంలో హైకోర్టు భవనానికి పశ్చిమ వైపుగా సిటీ కాలేజ్​ను 1921లో ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ నిర్మించారు. హిందూ ముస్లిం వాస్తుకళ మిశ్రమంతో 8 లక్షల రూపాయల ఖర్చుతో ఈ కాలేజ్​ నిర్మించారు. విశాలమైన వరండాలు, 10‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0కు పైగా తరగతి గదులు, ఎత్తయిన ప్రాకారాలతో రెండు అంతస్తులుగా ఈ కళాశాల నిర్మించారు. 

కళాశాల ప్రధాన భవనానికి తూర్పు, పశ్చిమ దిక్కుల్లో ప్రధాన ద్వారాలు ఏర్పాటు చేశారు. ఈ రెండు దిక్కుల్లో ఏ దిక్కు నుంచి చూసినా కళాశాల భవనం ఒకేలా కనిపిస్తుంది. మొదటి, రెండు అంతస్తుల వారందరికీ ఉపయోగపడేలా అతి పెద్ద హాలును నిర్మించారు. దీన్నే గ్రేటర్​ హాలు అంటారు. దీనిలో 100 మందికిపైగా కూర్చోవచ్చు. నిజాం ప్రభువు పిల్లల చదువు కోసమని సిటీ స్కూల్​గా ఏర్పడి, ఆ తర్వాత సిటీ కాలేజ్​గా అభివృద్ధి చెంది కాలానుగుణంగా నేటి విద్యా విధానంలోని పలు కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ కళాశాల స్థాపించి 2004, మార్చి 7 నాటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్లాటినం జూబ్లి వేడుకలు నిర్వహించారు.