సమాన అవకాశాలతోనే విజయాలు సాధ్యం : వేణు రెడ్డి

  • యూఎస్‌‌ఏ క్రికెట్‌‌ బోర్డు చైర్మన్‌‌ వేణు రెడ్డి
  • తెలంగాణ గ్రామీణ క్రికెటర్లకు సాయం చేయాలని టీడీసీఏ వినతి

హైదరాబాద్‌‌, వెలుగు : సమాన అవకాశాలు, పారదర్శకతతోనే ఆటలో విజయాలు సాధ్యం అవుతాయని యూఎస్‌‌ఏ క్రికెట్‌‌ బోర్డు చైర్మన్‌‌, నల్లగొండకు చెందిన పిసికే వేణు రెడ్డి అన్నారు.  అమెరికాకు చెందిన వివిధ క్రికెట్ టీమ్స్‌‌లో తెలుగు క్రికెటర్లు, ముఖ్యంగా పాలమూరు జిల్లా మూలాలు కలిగిన వాళ్లు చోటు దక్కించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.

హైదరాబాద్‌‌కు వచ్చిన వేణు రెడ్డితో  తెలంగాణ డిస్ట్రిక్ట్స్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్ (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్‌‌ రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా టీడీసీఏ  కన్వీనర్ సురేందర్ రెడ్డి బుధవారం సమావేశం అయ్యారు. తెలంగాణ గ్రామీణ క్రికెటర్లలో ఎంతో ప్రతిభ దాగి ఉన్నదని, వారికి  చేయూతను అందించేందుకు తమ సాయం చేయాలని వేణు రెడ్డిని కోరగా.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.