కొడంగల్ బడుల్లో బ్రేక్ ఫాస్ట్ .. స్కూళ్లలో విద్యార్థులకు టిఫిన్ ప్రోగ్రామ్ షురూ

  • పైలెట్​ ప్రాజెక్ట్ గా  ముఖ్యమంత్రి రేవంత్ సెగ్మెంట్ లో  అమలు 
  • హరే కృష్ణ చారిటబుల్​ ట్రస్ట్ కు ఫుడ్ తయారీ బాధ్యతలు
  • ఉదయం 8 గంటల్లోపే వాహనాల్లో స్కూళ్లకు 
  • డిస్​ప్యాచ్ టిఫిన్ చాలా టేస్ట్​గా ఉందంటున్న 
  • పలు స్కూళ్ల స్టూడెంట్లు

మహబూబ్​నగర్/కొడంగల్, వెలుగు : సర్కారు బడుల్లో చదువుకుంటున్న స్టూడెంట్లపై రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇటీవల గురుకులాల, కేజీబీవీలు, వసతి గృహాల్లో డైట్ చార్జీలను పెంచి, కొత్త మెనూ కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు సర్కార్ స్కూళ్లలోని స్టూడెంట్లకు బ్రేక్​ఫాస్ట్​అందించే ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టింది. తొలి విడతగా పైలెట్​ప్రాజెక్టు కింద ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సొంత నియోజక వర్గమైన కొడంగల్​లో అమలు చేస్తోంది. ఇక్కడ ఎనిమిది మండలాల్లోని312 స్కూల్స్​లో హరేరామ మూవ్ మెంట్ చారిటబుల్​ట్రస్ట్ కు ఫుడ్ ప్రిపేర్ బాధ్యతలు అప్పగించింది. స్థానికంగానే టిఫిన్ చేసేందుకు బహుబలి కిచెన్​షెడ్​ను ఏర్పాటు చేసింది. టిఫిన్లు టేస్ట్​గా ఉండటంతో తినేందుకు స్టూడెంట్లు ప్రేయర్​కు ముందే స్కూల్స్​కు వస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న బ్రేక్​ఫాస్ట్​ను ఇష్టంగా తింటున్నారు.

24 వేల మంది స్టూడెంట్లకు సప్లై​

సెగ్మెంట్ లో కొడంగల్, బొంరాస్​పేట, దౌల్తాబాద్​, దుద్యాల, కోస్గి, మద్దూరు, కొత్తపల్లి, గుండుమాల్ మండలాలుండగా.. మొత్తం 312 సర్కారు స్కూళ్లలో 24 వేల మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. ఉదయం బడులకు వచ్చిన విద్యార్థులకు వారం నుంచి సర్కార్ బ్రేక్​ఫాస్ట్​అందిస్తోంది. అందులో న్యూట్రీషియన్​ఫుడ్ ఉండేటట్లు కేర్​తీసుకుంటోంది. సోమవారం ఇడ్లీ సాంబార్​, మంగళవారం పూరి, ఆలు కుర్మ, బుధవారం ఉప్మా, సాంబార్, గురువారం మిల్లెట్​ఇడ్లీ, సాంబార్​, శుక్రవారం ఉగ్గాని లేదా చట్నీతో పొంగల్ లేదా పులిహోర, శనివారం బోండా చట్నీ అందించేలా మెనూను రూపొందించి విద్యార్థులకు అందిస్తున్నారు. 

Also Read :- ఎస్సీ ఉపకులాలకు సుప్రీం తీర్పుపై అవగాహన కల్పించాలి

తెల్లవారుజామునుంచే డిస్​ప్యాచ్​

ఉదయం ఎనిమిదిన్నర వరకు అన్ని స్కూళ్లకు బ్రేక్​ఫాస్ట్​ను సప్లై చేస్తున్నారు. మొత్తం 19 రూట్లలో వాహనాల ను నడుపుతున్నారు. బ్రేక్​ఫాస్ట్​ను స్కూల్​లో దింపడానికి ఓ గదిని కేటాయించారు. లాక్​ల సెట్​డిస్​ప్యాచ్​వద్ద, మరో లాక్​ స్కూల్​హెచ్ఎం వద్ద అందుబాటులో ఉంచారు. ఉదయం డిస్​ప్యాచ్​వెహికల్​వచ్చాక స్కూల్​వద్ద ఎవరు ఉన్నా లేకున్నా.. కేటాయించిన రూమ్​లో బ్రేక్​ఫాస్ట్​ను భద్రపరిచి వెళ్లిపోతారు. ఆ తర్వాత స్కూల్​సిబ్బంది తాళాలు తెరచి ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి ప్రేయర్​ టైం వరకు బ్రేక్​ఫాస్ట్​ను స్టూడెంట్లకు వడ్డిస్తున్నారు. 

తయారీకి బాహుబలి కిచెన్​​

కొడంగల్​అగ్రికల్చర్​మార్కెట్​యార్డులో ఇండిగ్రేటెడ్​మార్కెట్ నిర్మాణానికి అర ఎకరా స్థలాన్ని కేటాయించి.. గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టగా ఫండ్స్ లేక పిల్లర్ల దశలోనే నిలిపివేసింది. రేవంత్​సర్కారు వచ్చాక అసంపూర్తిగా ఉన్న నిర్మాణాన్ని బాహుబలి కిచెన్​షెడ్​ కోసం గత జూన్​లో హరే కృష్ణ చారిటబుల్​ ట్రస్ట్​కు అప్పగించగా.. ఈనెల 6న ప్రారంభించింది. ఇక్కడ టెక్నాలజీ ఆధారంగా బ్రేక్​ఫాస్ట్, వంటలు తయారు చేస్తున్నారు. మనుషుల సాయం లేకుండా మెషీన్ల ద్వారా టిఫిన్లు తయారవుతాయి. ఫుడ్​క్వాలిటీని టెస్ట్​చేసేందుకు ల్యాబ్​ను కూడా ఏర్పాటు చేశారు. వంటకాల్లో న్యూట్రీషియన్​శాంపిల్స్ ప్రతినెల ఎన్​ఏబీ ల్యాబ్​కు పంపిస్తారు. రిపోర్ట్​ ఆధారంగా ఫుడ్​లో మార్పులు, చేర్పులు చేస్తారు.

టిఫిన్ టేస్ట్ బాగుంది​

నేను ప్రభుత్వ ఎస్సీ గర్ల్స్​హాస్టల్​లో ఉండి చదువుకుంటున్నా. ఉదయం టిఫిన్​చేయడానికి టైమ్ ఉండదు. స్కూల్​కు వచ్చి మధ్యాహ్నం అన్నం తింటాను. ఇప్పుడు బ్రేక్​ఫాస్ట్​ పెడుతున్నారు. టిఫిన్ టేస్ట్ బాగుంది. అనిత, 8వ తరగతి, మల్​రెడ్డిపల్లి

అన్నం కూరనే వండుతరు 

పొద్దున్నే అమ్మ అన్నం, కూర వండి పొలానికి పోతది. ఇంట్లో టిఫిన్లు చేయరు. నేను చాయ్​, బిస్కెట్లు తిని స్కూల్​కు వస్త. మధ్యాహ్నమే అన్నం తింటా. ఇప్పుడు మా స్కూల్​లో బ్రేక్​ఫాస్ట్​పెడుతున్నరు. టేస్ట్​బాగుంది.

మౌనిక, 9వ తరగతి, చిల్మూర్​మైల్వార్​