మైనార్టీ గురుకులంలో స్టూడెంట్లుకు ఫుడ్​ పాయిజన్​

  • మహబూబ్​నగర్​ జిల్లా నాగసాల ప్రభుత్వ మైనార్టీ బాలుర గురుకులంలో ఘటన
  • 40 మందికి అస్వస్థత
  • తొమ్మిది మంది పరిస్థితి విషమం
  • హాస్టల్​అపరిశుభ్రంగా ఉందన్న కలెక్టర్​
  • ఆహారం సరిగ్గా లేదని ఆగ్రహం  
  • విచారణ జరుపుతామన్న విజయేందిర బోయి

మహబూబ్​నగర్​, వెలుగు : మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల సమీపంలోని నాగసాల వద్ద ఉన్న ప్రభుత్వ మైనార్టీ బాలుర గురుకులంలో ఫుడ్ ​పాయిజన్​అయ్యింది. ఉదయం బ్రేక్​ఫాస్ట్​ చేసిన తర్వాత స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. తొమ్మిది మందికి సీరియస్​గా ఉండడంతో స్థానిక ఏరియా హాస్పిటల్​కు తరలించారు. గురుకులంలో 240 మంది చదువుతుండగా, బుధవారం ఉదయం బ్రేక్​ఫాస్ట్ లో భాగంగా కిచిడీ పెట్టారు. 

తిన్న తర్వాత అందరూ కడుపునొప్పితో బాధపడ్డారు. వాంతులు చేసుకున్నారు. 40 మంది అస్వస్థతకు గురి కాగా..సోఫియాన్, ఆయూబ్, అయాన్, అబ్దుల్​రషీద్, సమీర్, చరన్​, అబ్రార్​, మనీశ్​, మాసుం బాబా పరిస్థితి సీరియస్​గా ఉండడంతో జడ్చర్ల ఏరియా హాస్పిటల్​కు తరలించారు.  మిగతా వారికి గురుకులం వద్దకే వచ్చిన డాక్టర్లు ట్రీట్​మెంట్ ​చేశారు. కలెక్టర్ విజయేందిర బోయి, అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఎంహెచ్​వో పద్మజ గురుకులానికి వచ్చి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్​ను పరిశీలించారు. 

హాస్టల్ ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై కలెక్టర్​ ఫైర్​ అయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ హాస్టల్​లో అపరిశుభ్ర వాతావరణం ఉందని, ఆహారం సరిగ్గా లేదన్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. స్టూడెంట్లకు ఎలాంటి ప్రమాదం లేదని డీఎంహెచ్​వో పద్మజ తెలిపారు. మధ్యాహ్నం గురుకులంలోనే అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్​సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజయ్య, డిప్యూటీ డీఎంహెచ్​వో శ్రీధర్ రెడ్డి ఉన్నారు.