- రెండింతలు వసూలు చేస్తున్నా పట్టించుకోని ఆఫీసర్లు
వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలోని ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల పేరుతో విద్యార్థులను దోచుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తుండడంతో ఇంటర్స్టూడెంట్లు ఆందోళనకు గురవుతున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్మెంట్లు నిర్ణయించిన ఫీజులు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ఆఫీసర్లకు తెలిసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు, పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇష్టం వచ్చిన ఫీజులు..
ఇంటర్ఫస్ట్ ఇయర్, సెకండ్ఇయర్ స్టూడెంట్లకు పరీక్ష ఫీజు రూ.520 ఉంటే, ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లు ఒక్కో కాలేజీలో ఒక్కో విధంగా వసూలు చేస్తున్నాయి. రూ.750 నుంచి రూ.వెయ్యి తీసుకుంటున్నాయి. ఇదేమంటే చలానా కట్టేందుకు ఒక మనిషిని ఏర్పాటు చేయాలని, తమకు ఖర్చు అవుతుందంటూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. వనపర్తిలోనే ప్రైవేట్ కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ కాలేజీల్లో జిల్లాతో పాటు నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల స్టూడెంట్లు చదువుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య వెయ్యికి పైగా ఉండగా, ఒక్కో కాలేజీలో రూ.వెయ్యి నుంచి రూ.1,500 చొప్పున స్టూడెంట్లు ఉన్నారు. అలా ఒక్కో స్టూడెంటు నుంచి రూ.300 చొప్పున అదనంగా వసూలు చేసినా కాలేజీ మేనేజ్మెంట్లకు వచ్చే అదనపు ఆదాయం ఎంతో అర్థం చేసుకోవచ్చు.
ఫీజు కోసం ఒత్తిడి..
పరీక్షల సమయంలో ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లు ట్యూషన్ ఫీజు కోసం విద్యార్థులను పీడిస్తున్నాయి. ఫీజు మొత్తం కడితేనే ఎగ్జామ్ ఫీజు తీసుకుంటామని తెగేసి చెబుతున్నాయి. అలా నందిహిల్స్లోని ఓ పేరున్న కాలేజీలో ఫీజు తీసుకోని విద్యార్థులు 30 మంది దాకా ఉన్నారు.
మిగతా కాలేజీల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. అడ్మిషన్ల సమయంలో యాజమాన్యాలు తాము ఎలాంటి ఇబ్బంది పెట్టమని చెప్పి, పరీక్షల సమయంలో మాత్రం కఠినంగా మాట్లాడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిందేనని పట్టుబట్టడంతో పేరెంట్స్ ఇబ్బంది పడాల్సి వస్తోంది. ట్యూషన్ ఫీజు కట్టకపోతే ఏడాది నష్టపోతామని పిల్లలు చెబుతుండడంతో అప్పులు చేసి మరీ ఫీజు చెల్లించేందుకు సిద్ధం అవుతున్నారు.
సీరియస్గా చెప్పాం..
ప్రైవేట్ కాలేజీల్లో పూర్తి స్థాయిలో విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించడం లేదన్న విషయం నా దృష్టికి వచ్చింది. కంప్లైంట్ వచ్చిన కాలేజీలకు సీరియస్గా చెప్పాం. ట్యూషన్ ఫీజుతో సంబంధం లేకుండా బోర్డు నిర్దేశించిన ప్రకారం పరీక్ష ఫీజు కట్టించుకోవాలని చెప్పాం. ఇంకా సతాయిస్తుంటే వారిపై చర్యలు తీసుకుంటాం.–అంజయ్య, డీఐఈవో
స్కాలర్షిప్అప్లికేషన్లకూ అంతే..
ప్రైవేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోడానికి కూడా మేనేజ్మెంట్లు డబుల్ చార్జీలను వసూలు చేస్తున్నాయి. మీసేవ, ఇతర ఇంటర్నెట్ సెంటర్లలో తక్కువ తీసుకుంటున్నారని అంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసుల్లో సార్లకు డబ్బులు ఇస్తేనే స్కాలర్షిస్ వస్తుందని, అందుకే ఎక్కువ తీసుకుంటున్నామని చెబుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు.
ఇంటర్నెట్ సెంటర్లలో స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోడానికి రూ.120 తీసుకుంటే, కాలేజీల్లో ఒక్కో స్టూడెంట్ నుంచి రూ.300 వసూలు చేస్తున్నారు. ఇంటర్నెట్ సెంటర్లలో దరఖాస్తు చేసుకుంటామంటే.. బోనాఫైడ్ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధిస్తున్నారని వాపోతున్నారు.