శంషాబాద్ ఒయాసిస్ స్కూల్ ముందు స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళన

శంషాబాద్/రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని ఒయాసిస్ పాఠశాల ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. 8.30కు స్కూల్ టైం కాగా 10నిమిషాలు లేటు కావడంతో దాదాపుగా 200మంది విద్యార్థులను స్కూల్ యాజమాన్యం గేటు బయట నిలబెట్టింది. ప్రిన్సిపల్ తీరును వ్యతిరేకిస్తూ విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు  రోడ్డుపై బైఠాయించి  ఆందోళనకు దిగారు. దీంతో శబద్ నుండి శంషాబాద్ వెళ్ళే దారీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించారు.  ఇన్స్పె క్టర్ నరేందర్ రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 
అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ 8:30కు స్కూల్ సమయం ఉండగా 10 నిమిషాలు లేటు కావడం తో గేటు బయట నిలబెట్టడం దారుణమన్నారు. 10 నిమిషాలు ఆలస్యమైందని తమ విద్యార్థులను ఆపిన యాజమాన్యం, 9 గంటలకు వచ్చే స్కూల్ బస్సులను అనుతించడం ఏంటని ప్రశ్నించారు. బస్సుల్లో వచ్చే వారికి ఒకన్యాయం, తమ పిల్లలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు.
ఎలాగైనా బస్లో ట్రాన్స్ పోర్ట్ చేయించాలనే దురుద్దేశం
ఎలాగైనా స్కూల్ బస్సుల్లో విద్యార్థులను ట్రాన్స్ పోర్ట్ చేయించాలనే దురుద్వేశంతోనే యాజమాన్యం ఈ చర్యలకు పాల్పడుతోందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చలికాలం కావడంతో చిన్నారులు కాస్త ఆలస్యంగా లేస్తారని, అందువల్లే కాస్త లేటు అవుతుందని, దానికే విద్యార్థులను రోడ్డుపై నిలబెట్టడం సమంజసం కాదని అన్నారు. విషయం ఏదైనా లోపలికి పిలిపించి మాట్లాడాల్సిందని, గేటు బయట నిలబెట్టడం వలన ఏదైనా అనుకోని ఘటన జరిగితే ఎవరు బాధ్యులని తల్లిదండ్రులు ప్రశ్నించారు.  అయితే శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులను లోపలికి పంపించగా.. లోపలికి వెళ్లిన విద్యార్థులు వెంటనే తిరిగి బయటికి వెళ్లిపోయారు. స్కూల్ టీచర్లు తమను కొడతారనే భయంతోనో బయటకు వచ్చినట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.