సెల్ఫీల మోజులో పడి ఇప్పటికే ఎంతో మంది యువతీ యువకులు చనిపోయారు. అయినా యూత్ లో సెల్ఫీ మోజు తగ్గడంలేదు. ఎత్తైన ప్రాంతాలు, కట్టడాలు, లోతైన లోయలు, జలాశయాల దగ్గర సెల్ఫీ తీసుకోవడం ప్రమాదకరమని తెలిసినా కూడా యువత పట్టించుకోవడం లేదు. సెల్ఫీలు దిగుతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటూ…కన్నవారికి కడుపుకోతను మిగులుస్తున్నారు. లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్‌లో సెల్ఫీ తీసుకుంటూ బిటెక్ విద్యార్థిని చనిపోయింది.
గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంట దగ్గర కృష్ణా జలాల్లో బిటెక్ విద్యార్థిని సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు చనిపోయింది. నరసరావుపేట పట్టణం వెంగళ్ రెడ్డినగర్‌కు చెందిన 20 ఏళ్ల ఐలా ధనలక్ష్మీ ఫ్రెండ్స్ తో కలిసి కండ్లగుంటలో ఓ శుభకార్యానికి బయలుదేరింది. దారి మధ్యలో గుంటూరు బ్రాంచ్ కెనాల్ వంతెనపై సెల్ఫీ తీసుకోవాలనుకుంది. స్నేహితుడు ముఖేశ్‌తో కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ ఇద్దరూ కాలువలో పడిపోయారు.
ఒడ్డున ఉన్న స్నేహితులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులు గల్లంతైన వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ముఖేశ్ ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులు ధనలక్ష్మిని ఒడ్డుకు చేర్చారు.అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ధనలక్ష్మిని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె చనిపోయినట్లు ధ్రువీకరించారు. కుమార్తె మృతిచెందడంతో విద్యార్థిని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

