మైండ్ బ్లోయింగ్: ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకు.. పల్టీలు కొట్టుకుంటూ వచ్చిన స్కూల్ బస్సు

తిరువనంతపురం: న్యూ ఇయర్ వేళ కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తోన్న స్కూల్ బస్సు సిని రేంజ్‎లో పల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి అక్కడికక్కడే  మరణించగా.. మరో 14 మంది స్టూడెంట్స్ గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. 2025, జనవరి 1వ తేదీ బుధవారం సాయంత్రం కేరళ కన్నూర్‌లోని వలక్కై మార్గంలో చిన్మయ్ స్కూల్‎కు చెందిన బస్సు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. 

విద్యార్థులతో వెళ్తోన్న ఈ బస్సు సినిమా రేంజ్‎లో రోడ్డుపై పల్టీలు కొడుతూ బోల్తా పడటంతో అందులోని ఓ విద్యార్థి స్పాట్‎లోనే చనిపోయాడు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 15 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.  మృతి చెందిన విద్యార్థి నేధ్యా ఎస్ రాజేష్‎గా గుర్తించారు. స్కూల్ బస్సు బ్రేక్ ఫెయిల్యూరే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు వెల్లడించారు. విద్యార్థులను సాయంత్రం స్కూల్ నుండి సాయంత్రం ఇంటికి తీసుకెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుందన్నారు.

 ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‎పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఘటన స్థలంలోని ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. ఆ రోడ్డు నుండి ఈ రోడ్డు పైకి స్కూల్ బస్సు పల్టీలు కొడుతోన్న దృశ్యాలు వీడియోలో క్లారిటీగా కనిపిస్తున్నాయి.