వనపర్తిలో అస్తవ్యస్తంగా స్ట్రీట్​ లైట్ల నిర్వహణ

 

వనపర్తి, వెలుగు: వనపర్తి మున్సిపాలిటీలో ఎల్ఈడీ స్ట్రీట్​ లైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కాంట్రాక్టర్​కు బిల్లులు చెల్లించకపోవడంతో వందల సంఖ్యలో స్ట్రీట్  లైట్లు వెలగడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

బిల్లులు చెల్లించట్లే..

వనపర్తి మున్సిపాలిటీలో 8 వేల ఎల్ఈడీ  స్ట్రీట్​ లైట్స్  ఉన్నాయి. వీటిని ఏడేండ్ల పాటు మెయింటెనెన్స్​ చేసేందుకు ఒకరికి కాంట్రాక్టు ఇచ్చారు. 2017 సెప్టెంబర్​లో కాంట్రాక్టు ఇవ్వగా, ఏడేండ్ల పాటు కాంట్రాక్ట్​ కొనసాగనుంది. ఇందుకోసం ప్రతి నెలా రూ.9 లక్షల చొప్పున కాంట్రాక్ట్​ పీరియడ్​ ముగిసేంత వరకు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. ఇలా రూ.7.56 కోట్లు చెల్లించాలి. ఎల్ఈడీ బల్బులు సక్రమంగా వెలిగేలా చూడాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ దే. బల్బు కాలిపోయినా, ఏదైనా రిపేరు చేయాల్సి వచ్చినా తానే చూసుకోవాలి. అలా ఎప్పటికప్పుడు రిపేర్లు చేసి స్ట్రీట్​ లైట్స్​ వెలిగేలా చూడాలి. కానీ, ఈ మధ్య నిర్వహణను పట్టించుకోవడం లేదు. ఇలా రూ.2 కోట్లు బకాయి పడడంతో మెయింటెనెన్స్​ను 
పక్కన పెట్టారు.

మిగతా మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి..

వనపర్తి మున్సిపాలిటీతో పాటు కొత్తకోట, పెబ్బేరుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. వనపర్తిలో 8వేల స్ట్రీట్​ లైట్స్​ ఉండగా, రూ.2 కోట్ల 58 వేలు బకాయి ఉన్నాయి. కొత్తకోట మున్సిపాలిటీలో 2,303 బల్బులు ఉండగా, రూ.20,55,866, పెబ్బేరు మున్సిపాలిటీలో రూ.15.85 లక్షలు పెండింగ్​లో ఉన్నాయి. ఎల్ఈడీ స్ట్రీట్​ లైట్స్​ పెండింగ్​ బిల్లులు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్​ మున్సిపాలిటీ ఆఫీస్​ చుట్టూ తిరగాల్సి వస్తోంది. 

త్వరలోనే చెల్లిస్తాం..

స్ట్రీట్​ లైట్స్​ బిల్లులకు మున్సిపల్​ కౌన్సిల్​ ఆమోదం తీసుకొని త్వరలోనే చెల్లిస్తాం. పట్టణ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూస్తాం. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తాం.

– పూర్ణచందర్, కమిషనర్, వనపర్తి