ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ రిక్వెస్ట్

  • 143 లేఖలు రాసినా స్పందన లేదని వెల్లడి
  • జనవరి 21న కేఆర్ఎంబీ19వ బోర్డు మీటింగ్  
  • రాయలసీమ ప్రాజెక్టుపై నిజనిర్ధారణకు సైట్ విజిట్ చేయండి
  • మీటింగ్​ ఎజెండాను పంపిన తెలంగాణ ఇరిగేషన్ అధికారులు

హైదరాబాద్, వెలుగు: కృష్ణా బేసిన్‎లో ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెంటనే ఆపేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్​మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ని తెలంగాణ కోరింది. రాయలసీమతో పాటు ఇతర ప్రాజెక్టులపై ఇప్పటికే 143 లేఖలు రాసినా స్పందన లేదని పేర్కొంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఏపీ చేపడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను ఏపీ వేగంగా చేపడుతున్నదని, ఆ పనులను వెంటనే ఆపించాలని విజ్ఞప్తి చేసింది. రాయలసీమ ప్రాజెక్టుకు సంబంధించి నిజనిర్ధారణ కోసం బోర్డు ఒకసారి సైట్‎ను పరిశీలించాలని, ప్రాజెక్ట్ లేటెస్ట్ ఫొటోలు తీసి కేంద్ర జలశక్తి శాఖకు పంపించాలని కోరింది.

వీలైనంత త్వరగా చర్యలు తీసుకునేలా జలశక్తి శాఖకు సూచించాలని, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఏపీ నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లకుండా చూడాలని తెలిపింది. ఈ మేరకు కృష్ణా బోర్డు మీటింగ్‎లో చర్చించాల్సిన ఎజెండాను బోర్డుకు ఇరిగేషన్ శాఖ అధికారులు పంపించారు. జనవరి 21న 19వ బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు కేఆర్ఎంబీ తెలుగు రాష్ట్రాలకు సోమవారం లేఖ రాసింది. 

ఆర్డీఎస్ ఆధునీకరణకూ ఏపీ అడ్డుపుల్ల.. 

ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులన్నీ భారీ నీటి మళ్లింపు పథకాలని, వాటితో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రాష్ట్ర అధికారులు కేఆర్ఎంబీకి తెలిపారు. విభజన చట్టం ప్రకారం కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఎజెండాలో పేర్కొన్నారు. అలాగే రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) ఆధునికీకరణకు కర్నాటక సహకరిస్తుంటే.. ఏపీ మాత్రం అడ్డుకుంటున్నదని పేర్కొంది. 

ఆర్డీఎస్ ఆనకట్ట శిథిలావస్థకు చేరుకుంటున్నదని, దానిని ఆధునీకరించకపోవడం వల్ల మూడు దశాబ్దాలుగా తెలంగాణకు న్యాయమైన వాటా దక్కడం లేదని తెలిపారు. మరోవైపు ఏపీ ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను చేపట్టిందని, నీటి వాటాల పంపిణీపై ప్రస్తుతం కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2లో విచారణ జరుగుతున్నందున ఏపీ ఆ పనులను నిలుపుదల చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీకి ఇప్పటికే ఏపీ డీపీఆర్​ను సమర్పించిందని, దానిని ఆమోదించవద్దని కోరారు. 

సాగర్ డ్యామ్​ను మేమే నిర్వహిస్తం

నాగార్జునసాగర్​ ప్రాజెక్టులో నిల్వ చేసుకున్న తమ ఆరేండ్ల క్యారీ ఓవర్ నీటిని వాడుకునేందుకు అవకాశం ఇవ్వాలని కూడా రాష్ట్ర అధికారులు ఎజెండాలో కోరారు. 2018–-19 నుంచి 2023-–2024 వరకూ మొత్తం 181.54 టీఎంసీలను తాము వినియోగించుకోలేదని, ఆ క్యారీ ఓవర్ నీటిని వాడుకునేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. అలాగే రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కేఆర్ఎంబీ డైరెక్షన్​లో నాగార్జునసాగర్ డ్యామ్ నిర్వహణను తామే నిర్వహిస్తున్నామని, కానీ, 2023 నవంబర్ 29న ఏపీ డ్యామ్​పైకి చొరబడి ఆక్రమించుకున్నదని పేర్కొన్నారు. 

అంతేగాకుండా కుడి కాల్వను బలవంతంగా అధీనంలోకి తీసుకున్నదన్నారు. సాగర్ ప్రాజెక్ట్​ నిర్వహణ బాధ్యత తెలంగాణదేనని డ్యామ్ సేఫ్టీ యాక్ట్ తేల్చి చెప్పిందని, కాబట్టి నిర్వహణ, ఓ అండ్ ఎం బాధ్యతలను తిరిగి తమకు అప్పగించాలని స్పష్టం చేశారు. కాగా, సాగర్ లెఫ్ట్ కెనాల్​లో నీటి నష్టంపై లెక్కల్లో తేడాలున్నాయని, దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించాలని కోరారు. నీటి నష్టాలపై అధ్యయనం చేసేందుకు వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.  

ఏపీ ఎజెండాలోని అంశాలివీ..

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పరిధిని తేల్చాలని ఏపీ ఎజెండాలో పేర్కొంది. సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ అధీనంలో ఉన్న వాటిని బోర్డుకు అప్పగిస్తే.. తాము కూడా అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద తెలంగాణ అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తున్నదని, దానిని నిలువరించాలని బోర్డును కోరింది. ట్రిబ్యునల్ అవార్డులు లేకుండానే కృష్ణా బేసిన్​లో తెలంగాణ సుంకిశాల ఇన్​టేక్ వెల్ నిర్మిస్తున్నదని, దానిని ఆపాలని విజ్ఞప్తి చేసింది. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్​నూ ఆపాలని కోరింది. ఇప్పటికే దీనిపై సీడబ్ల్యూసీకి లేఖలు రాశామని, కేడబ్ల్యూడీటీ 2, సుప్రీంకోర్టులో కేసులు వేశామని తెలిపింది. వాటిపై తీర్పులు వచ్చేదాకా ప్రాజెక్టును ఆపాలని కోరింది.