15 రోజుల్లోనే శిలాఫలకం ధ్వంసం..సీసీ కెమెరాలు పెట్టినా పట్టించుకోలే

పరిగి, వెలుగు: భారీ బందోబస్తు మధ్య ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వికారాబాద్​ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామ శివారులో పరిగి మున్సిపల్​డంపింగ్ యార్డు కోసం ఈ నెల 3న శంకుస్థాపన చేశారు. రూ.23 లక్షలతో తలపెట్టిన ఈ డంపింగ్ యార్డు ఏర్పాటును మండల పరిధిలోని రంగాపూర్, నజీరాబాద్ తండా, మాదారంతో పాటు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. శాకాపూర్​లో గతంలో డంపింగ్ యార్డుకు ప్రారంభోత్సవం చేసి, కొంతమేరకు పనులు కూడా జరిగాయి.

అక్కడే డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని, ఇక్కడికి తరలిస్తే తమ పంట పొలాలు పాడవుతాయని రైతులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో శంకుస్థాపన రోజు రాజకీయంగా హైడ్రామా నడిచింది. అడ్డుకుంటారేమోనన్న భయంతో ప్రజా ప్రతినిధులు ఎవరూ డంపింగ్ యార్డ్ ప్రారంభోత్సవానికి రాలేదు. దీంతో చేసేదేమీ లేక ఒక డీఎస్పీ, సీఐ, ఐదుగురు ఎస్ఐలు, 25 మందికిపైగా కానిస్టేబుళ్ల బందోబస్తు మధ్య మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య డంపింగ్ యార్డ్​కు శంకుస్థాపన చేశారు. ఈ శిలాఫలకాన్ని ఎవరైనా ధ్వంసం చేస్తారన్న ఆలోచనతో ముందస్తుగా సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ  దుండగులు ధ్వంసం చేశారు.