సీఎం వైఎస్ జగన్ పై రాయి దాడి.. నిందితుడు సతీష్ కు బెయిల్

ఎన్నికల ప్రచారంలో  భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో  అరెస్టైన నిందితుడు సతీష్ కు ఊరట లభించింది. సతీష్ కు విజయవాడ కోర్టు బెయిల్ ఇచ్చింది. జగన్‌పై దాడి కేసులో ఏ1 నిందితుడిగా ఉన్నాడు సతీష్‌.   విజయవాడలోని 8వ అదనపు జిల్లా న్యాయస్థానం సతీష్ కు  బెయిల్ మంజూరు చేసింది.  ప్రతి శని, ఆదివారాల్లో స్థానిక పోలీస్ స్టేషన్‌లో సంతకం పెట్టాలని ఆదేశించింది. 

ప్రస్తుతం రిమాండ్‌ ఖైదీగా ఉన్న సతీష్‌ పేపర్ వర్క్ తరువాత విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంలో  భాగంగా విజయవాడలో నిర్వహించిన  మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. బస్సు ఎక్కి సీఎం జగన్  ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు ఆగంతకులు పూలతో పాటు రాయి విసిరారు. అది సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై తాకి గాయం అయింది.  పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి సైతం గాయపడ్డారు.  

జగన్ పై రాయి దాడి కేసు రాజకీయంగానూ పెను సంచలనం అయింది. తగిలింది చిన్న గాయమే అయినా నేరుగా  హత్యాయత్నం కేసు పెట్టడం.. ఆ హత్యాయత్నం వెనుక టీడీపీ నేతలు ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేయడంతో  ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం నెలకొంది.