IND vs AUS: స్మిత్ బ్యాడ్ లక్.. 9999 పరుగుల వద్ద ఆసీస్ స్టార్‌కు నిరాశ

భారత్ తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ టెస్ట్ కెరీర్ లో బ్యాడ్ టైమ్‌ను ఎదుర్కొన్నాడు. సిరీస్ కు ముందు తీవ్ర ఒత్తిడిలో ఉన్న అతను 2015 తర్వాత తొలిసారి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ 10 లో చోటు కోల్పోయాడు. రెండేళ్ల నుంచి స్మిత్ ఫామ్ అంతంత మాత్రంగానే ఉంది. ఏడాది కాలంగా అత్యంత దారుణంగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే అతను ఆస్ట్రేలియా జట్టులో స్థానం కోల్పోయినా ఆశ్చర్యం లేదనే వార్తలు వచ్చాయి. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్మిత్ గాడిలో పడ్డాడు. 

సిరీస్ లో భాగంగా తొలి రెండు టెస్టుల్లో విఫలమైన ఈ ఆసీస్ స్టార్.. చివరి మూడు టెస్టుల్లో అద్భుతంగా రాణించాడు. వీటిలో రెండు సెంచరీలు ఉన్నాయి. మొత్తం 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో 35 యావరేజ్ తో 314 పరుగులు చేసి ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో స్మిత్ 10000 పరుగుల క్లబ్ లోకి ఎంట్రీ ఇద్దామనుకుంటే నిరాశే మిగిలింది. సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 5 పరుగులు చేస్తే స్మిత్ కెరీర్ లో 10 వేల పరుగులు పూర్తి చేసుకునేవాడు. కానీ 4 పరుగులే చేసి ఔటయ్యాడు. 

ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో స్లిప్ లో జైశ్వాల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో స్మిత్ టెస్ట్ కెరీర్ లో 9999 పరుగుల వద్ద బ్రేక్ పడింది. త్వరలో ఆస్ట్రేలియా రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించనుంది. స్మిత్ టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తి చేయడానికి ఈ సిరీస్ వరకు ఎదురు చూడక తప్పదు. 35 ఏళ్ల అతను ఇప్పటివరకు 114 టెస్ట్ మ్యాచ్‌ల్లో 55.86 సగటుతో 9999 పరుగులు చేశాడు. కనీసం 5000 టెస్ట్ పరుగులు చేసిన బ్యాటర్‌లలో, బ్రాడ్‌మాన్ 99.94 తర్వాత ఆస్ట్రేలియన్‌లలో ఇది రెండో అత్యుత్తమ సగటు. డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత టెస్ట్ క్రికెట్‌లో ఓపెనర్‌గా స్మిత్.. ఎనిమిది ఇన్నింగ్స్ ల్లో 28 సగటుతో 171 పరుగులు మాత్రమే చేశాడు.