Border-Gavaskar Trophy: భారత్‌తో టెస్ట్ సిరీస్.. దేశవాళీ క్రికెట్ బాట పట్టిన స్టార్క్, స్మిత్

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ  2024-25 టెస్ట్ సిరీస్ నవంబర్ 22 నుంచి జనవరి 3 వరకు జరుగుతుంది. రోహిత్ శర్మ కెప్టెన్ గా ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియాలో భారత్ పర్యటిస్తుంది. ఆస్ట్రేలియాలో జరిగిన చివరి రెండు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలు భారత్ గెలుచుకుంది. దీంతో ఈ సారి ఆస్ట్రేలియా  సొంతగడ్డపై ఎలాగైన ఈ ప్రతిష్టాత్మక సిరీస్ గెలుచుకోవాలని చూస్తుంది. దీని కోసం ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు దేశవాళీ క్రికెట్ ఆడనున్నారు.
 
అక్టోబర్ 20 (ఆదివారం) నుంచి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో షెఫీల్డ్ షీల్డ్‌ రెండో రౌండ్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీలో  ఆస్ట్రేలియా స్టార్లు స్టీవెన్ స్మిత్,మిచెల్ స్టార్క్ ఆడేందుకు సిద్ధమయ్యారు. న్యూ సౌత్ వేల్స్ ప్రకటించిన జట్టులో వీరిద్దరి పేరు ఉంది. స్టార్క్ చివరిసారిగా 2020-21 సీజన్‌లో షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ ఆడాడు. మరోవైపు స్మిత్ 2021 తర్వాత తొలి సారి దేశవాళీ క్రికెట్ ఆడబోతున్నాడు. 

ALSO READ | WI vs NZ T20 T20 World Cup 2024: తలకు తగిలిన బంతి.. గ్రౌండ్‌లోనే కుప్పకూలిన విండీస్ క్రికెటర్

ఆస్ట్రేలియా టెస్ట్,వన్డే కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ షెఫీల్డ్ షీల్డ్‌కు అందుబాటులో ఉండట్లేదు. అయితే అక్టోబర్ 25న జంక్షన్ ఓవల్‌లో జరిగే వన్డే కప్ మ్యాచ్‌లో వీరు పాల్గొనే అవకాశం ఉంది. నవంబరు 4న పాకిస్థాన్‌తో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ కు కమ్మిన్స్, హేజిల్‌వుడ్ ఎంపికయ్యారు. దీంతో వీరిద్దరూ రెడ్ బాల్ క్రికెట్ ఆడే అవకాశం లేకుండా పోయింది. ఇంగ్లాండ్ పర్యటనలో గాయం కారణంగా తొలి రౌండ్ మ్యాచ్ లకు దూరమైన ఫాస్ట్ బౌలర్ అబాట్ తో పాటు నాథన్ లియాన్ అందుబాటులో షెఫీల్డ్ షీల్డ్‌ టోర్నీ ఆడనున్నారు. 

న్యూ సౌత్ వేల్స్ జట్టు:

సీన్ అబాట్, జాక్సన్ బర్డ్, ఒల్లీ డేవిస్, జాక్ ఎడ్వర్డ్స్, మోయిసెస్ హెన్రిక్స్, సామ్ కాన్స్టాస్, నాథన్ లియోన్, నిక్ మాడిన్సన్, జాక్ నిస్బెట్, జోష్ ఫిలిప్, తన్వీర్ సంఘా, స్టీవెన్ స్మిత్, మిచెల్ స్టార్క్